
అమ్రాబాద్, వెలుగు : మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన సందర్భంగా డ్యూటీకి వచ్చి కనిపించకుండా పోయిన హోంగార్డు వెంకటేశ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం మంత్రి సత్యవతి రాథోడ్ అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్‌లో పర్యటించగా ఈగలపెంట పోలీస్ స్టేషన్ హోంగార్డు వెంకటేశ్‌కు బందోబస్తు డ్యూటీ వేశారు. డ్యూటీ అయిపోయిన తర్వాత తాను ఆలస్యంగా వస్తానని తోటి సిబ్బందికి చెప్పి పంపించాడు. తర్వాత కనిపించకుండా పోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ సిగ్నల్, హరిత రిసార్ట్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజీల ద్వారా అడవిలోకి వెళ్లినట్లు గుర్తించారు.
దుర్వాసుల చెరువు, అడవి మార్గం గుండా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉసిళ్లబండ కుంట వద్ద కుళ్లిన స్థితిలో చెట్టుకు వేలాడుతున్న వెంకటేశ్ మృతదేహాన్ని గుర్తించారు. ఫారెస్ట్ ఆఫీసర్లు అడవిలో పెట్టిన సీసీ కెమెరాల ఆధారంగా వెంకటేశ్ బోర్ మోటార్ వైరుతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తేల్చారు. దీనిపై విచారణ కొనసాగుతోందన్నారు. మృతుడికి భార్య జ్యోతి, కొడుకు రుషి వర్మ, కూతురు తేజశ్రీ ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.