
Cooperative Taxi Service: ప్రస్తుతం దేశంలో ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి కంపెనీలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కేటగిరీలో సేవలను అందిస్తున్నాయి. ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ సేవల వ్యాపారంలో ఇవి గుత్తాధిపత్యాన్ని చెలాఇస్తున్న సంగతి తెలిసిందే. ఇవి ప్రజల నుంచి అధికంగా రేట్లు వసూలు చేయటం నుంచి డ్రైవర్లకు తక్కువ చెల్లింపు వరకు అనేక ఆరోపణలను సైతం అందుకుంటున్న సంగతి తెలిసిందే.
అయితే తాజగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీటి గుత్తాధిపత్యానికి బ్రేక్ వేసే అతిపెద్ద ప్రకటన గురించి పార్లమెంటుకు వెల్లడించారు. మోదీ సర్కార్ రానున్న కొద్ది నెలల్లో క్యాబ్ సేవలను ఓలా, ఉబెర్ తరహాలోనే స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందని వెల్లడించారు. ఇందుకోసం సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు తమ టూవీలర్స్, త్రీవీలర్స్, ఆటోలు, కార్లను ఇందులో నమోదు చేసుకోవటం ద్వారా ప్రయోజనం పొందవచ్చని పార్లమెంటులో ప్రకటించారు.
ఈ సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ నుంచి వచ్చే లాభాలు నేరుగా రిజిస్టర్ చేసుకున్న డ్రైవర్లకు వెళతాయని ఆయన అన్నారు. ఈ ప్రకటన ప్రైవేటు సర్వీస్ ప్రొవైడర్లైన ఓలా, ఉబెర్, ర్యాపిడోలకు నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పటికే ఓఎన్డీసీ వంటి ఓపెన్ ఫ్లాట్ ఫారమ్ ఆధారంగా బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన మెట్రో నగరాల్లో వివిధ యాప్స్ సదరు దిగ్గజ కంపెనీల పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ రంగంలోకి దిగితే పోటీ మరింత పెరుగుతుందని తెలుస్తోంది. కానీ ప్రజలకు దీని వల్ల మెరుగైన సేవలు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.
►ALSO READ : మంచి జీవితం, జీతం కోసమే.. ఇండియా నుంచి వెళ్లిపోతున్నం |
ఇదే క్రమంలో కేంద్రం త్వరలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీని కూడా సహకార సంఘాల ఆధారంగా స్టార్ట్ చేయాలనే ప్రణాళికలను రచిస్తోందని అమిత్ షా వెల్లడించటం ప్రైవేటు బీమా కంపెనీలను కుదిపేస్తోంది. ఓలా ఉబెర్ వంటి పెద్ద కార్పొరేట్ల హవాను రెయిడ్ హెయిలింగ్ వ్యాపారంలో నివారించటానికి ప్రయత్నాలు దీనికి ముందు 2017లోనే దిల్లీలో స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా దిల్లీలోని టాక్సీ డ్రైవర్లు ప్రత్యేకంగా సేవా క్యాబ్ పేరుతో ముందుకొచ్చారు. ఇదే తరహా చర్యలు కేరళ రాష్ట్రంలోనూ కనిపించాయి. అయితే ఇవి పెద్ద కార్పొరేట్లను ఎదుర్కొని నిలబటంలో సఫలం కాలేకపోయాయి. అయితే కేంద్ర హోం మంత్రి ప్రకటించిన కొత్త యాప్ వీటి ఆధిపత్యాన్ని తట్టుకుని నిలబడుతుందా లేక మట్టికరుస్తుందా అనే అంశం వేచి చూడాల్సిన విషయం. అయితే బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ అయిన ఓఎన్డీసీ ఫ్లాట్ ఫారమ్ నమ్మ యాత్రి మాత్రం కొచ్చి, కలకత్తా, మైసూరు, హైదరాబాద్ వంటి నగరాలకు విస్తరించి ముందుకు సాగుతోంది.
కేంద్ర మంత్రి ప్రకటించినట్లు కొత్త యాప్ మార్కెట్లోకి విడుదల చేయబడితో ప్రపంచంలో తొలిసారిగా ప్రజల కోసం రెయిడ్ హెయిలింగ్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్న తొలి ప్రభుత్వ సహకారం కలిగిన కోపరేటివ్ సంస్థగా ఇది నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పాల వ్యాపారంలో అమూల్ ప్రపంచ గుర్తింపును తెచ్చుకున్న సహకార సంస్థగా నిలవటం గమనార్హం.