సూర్యాపేటలో అక్టోబర్ 27న అమిత్ షా సభ

  • ఏర్పాట్లు పరిశీలించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌

సూర్యాపేట, వెలుగు :  జిల్లా కేంద్రంలోని మార్కెట్‌‌ యార్డు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న జనగర్జన సభకు  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.  గురువారం సభ ఏర్పాట్లను బీజేపీ గోషామహాల్‌‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌‌ఎస్, కాంగ్రెస్‌‌ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.  బీఆర్‌‌ఎస్‌‌ తీసుకొచ్చిన ప్రతి స్కీమ్‌‌లో స్కామ్‌‌ జరిగిందని ఆరోపించారు.

ఎన్నికల ముందు ఆ పార్టీకి కొత్త స్కీములు గుర్తుకొస్తాయని, దళిత బంధు, బీసీ బంధు గృహలక్ష్మి పథకాలతో ఎంతమందికి లబ్ధి జరిగిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు.  సీఎం కేసీఆర్‌‌‌‌ మాటలు చెప్పి మాయలు చేయడంలో దిట్ట అని, బంగారు తెలంగాణ  పేరు చెప్పి అప్పులు, మద్యం తెలంగాణగా మార్చారని విమర్శించారు.  ఈ కార్యక్రమంలో బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ బాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.