బుల్లెట్కు బుల్లెట్తోనే బదులిస్తం: పాక్కు అమిత్ షా వార్నింగ్​

బుల్లెట్కు బుల్లెట్తోనే బదులిస్తం: పాక్కు అమిత్ షా వార్నింగ్​
  • కాశ్మీర్​ గడ్డపై నుంచి పాక్కు అమిత్ షా వార్నింగ్​
  • కాశ్మీర్లో ఫైరింగ్ ముగిసిందని కామెంట్​
  • కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ టెర్రరిజాన్ని ప్రోత్సహించాయని ఫైర్

మేంధార్: ప్రధాని మోదీకి పాకిస్తాన్ భయపడుతున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకాశ్మీర్ లో బార్డర్ వెంబడి శాంతి నెలకొన్నదని ఆయన చెప్పారు. ‘‘1990లలో క్రాస్ బార్డర్ ఫైరింగ్ జరిగేది. అప్పట్లో జమ్మూకాశ్మీర్​ను పాలించినోళ్లు పాకిస్తాన్ కు భయపడేవారు. కానీ ఇప్పుడు పాకిస్తానే ప్రధాని మోదీకి భయపడుతున్నది. ఫైరింగ్ చేసేందుకు వాళ్లు సాహసించడం లేదు. ఎందుకంటే ఒకవేళ ఫైరింగ్ చేస్తే, మనం తగిన జవాబు ఇస్తామని వాళ్లకు తెలుసు” అని పేర్కొన్నారు. 

‘‘జమ్మూకాశ్మీర్ లో క్రాస్ బార్డర్ ఫైరింగ్ జరిగే రోజులు ముగిసినయ్. ఇక్కడి పరిస్థితులను పూర్తిగా మార్చేశాం. ఒకవేళ బార్డర్ అవతలి నుంచి బుల్లెట్స్ దూసుకొస్తే, మేం కూడా బుల్లెట్లతోనే సమాధానం చెబుతాం.. చర్చలతో కాదు” అని హెచ్చరించారు. శనివారం జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలోని మేంధార్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. ఇక్కడి యువతను సరైన మార్గంలో నడిపించి, టెర్రరిజాన్ని అంతం చేశామని ఆయన చెప్పారు.

ఆ మూడు పార్టీల వల్లే.. 
టెర్రరిజం 1990లో ఎక్కువైందని, అది 2014 వరకు కొనసాగిందని అమిత్ షా చెప్పారు. ఈ టైమ్ లో 40 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ‘‘నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు టెర్రరిజాన్ని కట్టడి చేయడానికి బదులు ప్రోత్సహించాయి. ఈ 3 కుటుంబ పార్టీలు జమ్మూకాశ్మీర్ లో ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేశాయి. మేం వచ్చిన తర్వాత ఆ పరిస్థితులను మార్చేశాం. ఒకప్పుడు గన్నులు, రాళ్లు పట్టిన యువత చేతుల్లో ల్యాప్ టాప్స్ పెట్టి టెర్రరిజాన్ని అంతం చేశాం” అని తెలిపారు. జమ్మూకాశ్మీర్​లో మళ్లీ తుపాకుల శబ్దం వినబడనివ్వబోమని అన్నారు. 

‘‘నాది గుజరాత్.. బార్డర్​ సమీపంలోని మేంధార్​కు వస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. 1947లో మన బార్డర్లను కాపాడిన పహరీలు, గుజ్జర్లు, బేకర్వాల్స్​కు సెల్యూట్. 1990లో ఫరూక్​ అబ్దుల్లా వైఖరి వల్ల ఉగ్రవాదం తీవ్రమైంది. టెర్రరిజం వల్ల ఎవరికీ ఎలాంటి లాభం ఉండదు. దాన్ని అంతం చేసేందుకు పహరీ యూత్​కు మేంకూడా గన్స్ ఇస్తున్నాం. స్పెషల్ రిక్రూట్​మెంట్ డ్రైవ్స్ ద్వారా వాళ్లను పోలీస్, ఆర్మీలోకి తీసుకుంటున్నాం” అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు అమలుచేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీకి బుద్ధి చెప్పి.. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.