- ఆయనకు ఫోన్ చేసి బతికించుమన్నా ఓ వ్యక్తిని కాపాడలేకపోయిండు
- నెలలో కోడ్ వస్తది.. అందుకే కేసీఆర్ హడావుడి చేస్తున్నడు
- బీఎస్పీ స్టేట్చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని,హోంమంత్రికి ఓ సంఘ సేవకుడు ఫోన్ చేసి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని మొరపెట్టుకున్నా అతడి ప్రాణాలు దక్కకపోవడం చూస్తే రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నడా? లేడా? అనే అనుమానం వస్తున్నదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మంగళవారం ఆసిఫాబాద్‌జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గం పర్యటనలో భాగంగా కౌటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
నెలలో ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుందని, అందుకే సీఎం కేసీఆర్ స్కీమ్ ల మీద స్కీమ్ లు తీస్తున్నాడని, ప్రజలు పైలంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లోని హకీంపేటకు చెందిన సంఘ సంస్కర్త స్వయంగా హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేసి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రాణం కాపాడాలని వేడుకున్నా ఆయన ప్రాణం నిలవలేదని ఈ నెల 10న ఆయన హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజాలను నిర్భయంగా బయటపెడ్తున్న పత్రికలు, చానల్స్‌పై ఆంక్షలు విధించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. మీడియాను చూస్తే కేసీఆర్ భయపడ్తున్నారని ఎద్దేవా చేశారు. కౌ టల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత –- చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి కేవలం కాల్వలు తవ్వి వదిలేశారని, కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం ప్రాజెక్టు రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టి వార్ధా నదిపై బ్యారేజ్ కడ్తానని చెప్పడం వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికేనన్నారు.
సిర్పూర్ టీ మండలం కేశవ పట్నంలో ఇటీవల ఇచ్చిన పోడు భూముల పట్టాలను వెనక్కి తీసుకునేందుకు ఆఫీసర్లు ప్రయత్నించడం కరెక్ట్కాదని, దీనిపై పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, అధికార ప్రతినిధి జక్కని సంజయ్, జిల్లా అధ్యక్షుడు మోర్లే గణపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.