
హసన్ పర్తి, వెలుగు : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ విమర్శించారు. బీఆర్ఎస్ పైనా, సీఎం కేసీఆర్ పైనా ఆ పార్టీ నేతలు అభాండాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి హోం మంత్రి మాట్లాడారు.
ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్ అయినప్పటి నుంచి అభ్యర్థులనే ప్రకటించలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పెట్టిన ఏ ఒక్క సభ కూడా సక్సెస్ కాలేదన్నారు. ప్రజల్లో ఆదరణ లేని కాంగ్రెస్ నాయకులు వారంటీ లేని ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి జిల్లా నుంచి ఒకరు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్నారని, ఎన్నికలు వచ్చినప్పుడే వారికి ప్రజలు గుర్తుకొస్తారని ఫైరయ్యారు. ఇక దేశంలోనే ఎక్కడాలేని సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకెళ్తున్నదని పేర్కొన్నారు.