
- త్రీమెన్ కమిటీ ఏర్పాటు.. 17న తొలి భేటీ..
- ఇకపై ప్రతి నెలా మీటింగ్
- చాలా అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య కుదరని సయోధ్య
- కరెంట్ బకాయిలపై ఎవరి లెక్కలు వాళ్లవే
- కేంద్ర గ్రాంట్ల వినియోగంపై తేల్చని ఏపీ, తెలంగాణ
- ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, పన్నుల వసూళ్లలోనూ అంతే
- వీలైనంత త్వరగా సామరస్యంగా పరిష్కరించాలని కేంద్రం నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం హోం శాఖ జాయింట్ సెక్రటరీ ఆశీష్ కుమార్ ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో తెలంగాణ ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ ఎస్‌ఎస్ రావత్ సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 17న కమిటీ వర్చువల్‌గా భేటీ కానుంది. కమిటీ ఇకపై ప్రతినెల ఒకసారి సమావేశమై విభజన సమస్యలపై చర్చించనుంది. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లోని కేంద్ర ప్రభుత్వ హామీలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనేక సమస్యలు ఏండ్లకేండ్లుగా ఎటూ తేలకుండా ఉంటున్నాయి. అయితే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో గత నవంబర్ 14న నిర్వహించిన సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ తర్వాత విభజన పంచాదిపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సమస్యలకు ముగింపు పలకాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే గత నెల 12న రెండు రాష్ట్రాలతో సమావేశమైంది. ఇక ఈ నెల 8న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ భేటీ అయింది. సమస్యలపై చర్చించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది.
సమావేశంలో వీటిపై చర్చ
విభజన చట్టానికి ఇంకో రెండున్నరేండ్లే మిగిలి ఉండటంతో వివాదాలను సామరస్యపూర్వకంగా త్వరగా పరిష్కరించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. 9 అంశాలతో ఎజెండాను రూపొందించింది. ఆ తర్వాత అందులో నుంచి 4 అంశాలను తొలగించి సవరించిన కాపీని మళ్లీ 2 రాష్ట్రాలకు పంపింది. ఏపీలో ఏడు వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంట్ల విడుదల, ఏపీకి ప్రత్యేక హోదా, రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు, ఏపీ-తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక వనరులు వంటి వాటిని రివైజ్డ్ ఎజెండాలో తీసేసింది. 17న జరిగే భేటీలో ఉమ్మడి ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ-, తెలంగాణ మధ్య అపరిష్కృతంగాఉన్న విద్యుత్ వివాదాలు, బకాయిలు, రెండు రాష్ట్రాల మధ్య పన్నుల విషయంలో తలెత్తిన వివాదం, వివిధ బ్యాంకుల్లో రెండు రాష్ట్రాలకు ఉన్న నగదు, డిపాజిట్ల విభజన, ఏపీఎస్‌సీఎస్‌సీఎల్, టీఎస్‌సీఎస్‌సీఎల్ మధ్య నగదు చెల్లింపుల విభజన అంశాలపై చర్చించనున్నారు.
కరెంట్ బకాయిలపై ఎవరి లెక్కలు వాళ్లవే
విద్యుత్ సంస్థల నుంచి తమకే బకాయిలు వచ్చేది ఉందని ఏపీ చెప్తుండగా, ఏపీ నుంచి తమకు వచ్చేది ఉందని తెలంగాణ వాదిస్తున్నది. ఏపీ నుంచి రూ.12,111 కోట్లు రావాల్సి ఉందని ఇటీవల జరిగిన భేటీలో తెలంగాణ అధికారులు కేంద్రానికి వివరించారు. ఏపీ మాత్రం తెలంగాణ నుంచే రూ. 3,442 కోట్లు రావాల్సిఉందని పేర్కొంది. దీనిపై హైకోర్టులో ఏపీ కేసు వేసింది. సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు తక్కువ ధరకే హైడల్ విద్యుత్ అందేదని, కానీ దాన్ని ఏపీకి కేటాయించడంతో తెలంగాణ తప్పనిసరై ఇతర మార్గాల్లో ఎక్కువ ధరకు విద్యుత్‌ను కొనుక్కోవాల్సి వచ్చిందని, ఫలితంగా తెలంగాణకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర అధికారులు చెప్తున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల కరెంట్ అప్పులు తీర్చడానికి, సీలేరు నుంచి కరెంటు అందకపోవడంతో బయట నుంచి ఎక్కువ ధరకు కొనడానికి అయిన ఖర్చును లెక్కలోకి తీసుకుంటే తెలంగాణకే రూ. 12,111 కోట్లు వస్తుందని పేర్కొంటున్నారు.
ఫైనాన్స్ కార్పొరేషన్‌పై ఏకాభ్రిపాయం కుదిరేనా?
ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో ఈ సంస్థకు చెందిన స్థిరాస్తులతో పాటు బ్యాంకుల్లో డిపాజిట్లు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడున్న కార్పొరేషన్ గవర్నింగ్ బాడీలో తెలంగాణ తరఫున ప్రతినిధులెవ్వరూ లేరని తెలంగాణ చెప్తున్నది. నిష్పత్తి ప్రకారం సభ్యుల నియామకం పూర్తయిన తర్వాత బోర్డులో చర్చ జరిగి తీర్మానం ఆమోదం పొందిన తర్వాతనే ఆ సంస్థ విభజన ప్రక్రియ చేపట్టాలని అంటున్నది. దీంతో విభజన ఆగిపోయింది. షీలా భిడే కమిటీ సిఫార్సులు కూడా అమలులోకి రాలేదు.
పన్నుల వసూళ్లలోనూ తెగని పంచాయితీ
పన్నుల వసూళ్లలోనూ భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. జనాభా ప్రకారం పన్నులు పంచాలని ఏపీ వాదిస్తున్నది. అయితే వసూలైన పన్నులను మాత్రమే ఆ ఫార్ములాలో పంచుకుని, వసూలు కావాల్సిన వాటిని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే తీసుకోవాలని విభజన చట్టం చెప్తున్నది. నిబంధన ప్రకారమే ఇవ్వాలని తెలంగాణ అంటున్నది. అయితే ఈ ప్రతిపాదనకు ఒప్పుకోని ఏపీ.. వసూలైనదాన్ని, వసూలు కావాల్సిన మొత్తాన్ని ఒకే యూనిట్‌గా పరిగణించాలని, లేదంటే రూ.3,821 కోట్లు కోల్పోవాల్సి వస్తుందని వాదిస్తున్నది.
తెలంగాణ కోరుకునే మరికొన్ని అంశాలివే..
సింగరేణికి అనుబంధంగా ఏపీలో ఏర్పాటు చేసిన ఆప్మెల్ తెలంగాణకే చెందుతుందని మన రాష్ట్రం వాదిస్తున్నది. ఇందుకు ఏపీ ససేమిరా అంటున్నది. విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో 21 సంస్థల విభజన చేయాల్సి ఉంది. పదో షెడ్యూల్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విభజన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా ఎటూ తేలకుండానే ఉండిపోయింది. ఈ సంస్థ తెలంగాణకే దక్కుతుందని సుప్రీంకోర్టు చెప్పినా విభజన పూర్తి కాలేదు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ట్రైబల్ వర్సిటీ హామీలతో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాసంస్థల ఏర్పాటుపైనా పట్టుబట్టాలని తెలంగాణ భావిస్తున్నది. ఈ నెల 17న జరిగే త్రీమెన్ కమిటీ సమావేశం నిర్దేశిత ఎజెండాతో జరిగినా భవిష్యత్‌లో జరిగే సమావేశాల్లో తెలంగాణ ఎజెండాను కూడా చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వయంత్రాంగం సిద్ధమవుతున్నది.
కేంద్ర గ్రాంట్ల వినియోగంపై తేల్చని రెండు రాష్ట్రాలు
ఉమ్మడి రాష్ట్రంలో వివిధ సంస్థలకు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ల విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరట్లేదు. కేంద్ర పథకాల కోసం వచ్చిన గ్రాంట్ల వినియోగంలో 2 రాష్ట్రాలు ఏడేండ్లుగా వాటాలను తేల్చుకోలేక పెండింగ్‌లో పెట్టాయి. ఈ మొత్తం రూ. 495 కోట్లు ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు. హైకోర్టు, రాజ్‌భవన్ లాంటి కామన్ అవసరాలకు చేసిన రూ. 315 కోట్ల ఖర్చు విషయంలోనూ ఇంకా పంపకాలు తేలలేదు. నిర్మాణంలో ఉన్న కొన్ని భవనాల వాటా, రూ.456 కోట్ల మేర సంక్షేమ బోర్డు నిధి, రూ.208 కోట్ల మేర నికర క్రెడిట్ తదితరాలపై త్రీమెన్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
For more news..
ఏపీ అభివృద్ధి కోసం బీజేపీతో చేతులు కలపండి
అధికారిక లాంఛనాలతో రాహుల్ బజాజ్ అంత్యక్రియలు