
- 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలి
- రిలీవ్ చేయాలంటూ తెలంగాణ సర్కారుకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లకు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. మాజీ డీజీపీ అంజనీకుమార్, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని ఏపీ కేడర్ కు వెళ్లాలని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఏపీ కేడర్ లో రిపోర్ట్ చేయాలని గడువు విధించింది. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర విభజన సందర్భంగా ఈ ముగ్గరిని ఏపీ కేడర్ కు కేటాయించారు. ఐతే వివిధ కారణాల చేత తమను తెలంగాణలోనే కొనసాగించాలని వీరు ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఏపీలో రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంజనీకుమార్ రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర డీజీపీగా పనిచేశారు. కౌంటింగ్ జరుగుతుండగానే అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పాడు. దీంతో ఈసీ ఆయన్ను సస్పెండ్ చేసింది.