ఇండ్ల అమ్మకాలు 11 ఏళ్ల గరిష్టానికి.. 1.73 లక్షల యూనిట్ల అమ్మకం

ఇండ్ల అమ్మకాలు 11 ఏళ్ల గరిష్టానికి.. 1.73 లక్షల యూనిట్ల అమ్మకం
  •     హైదరాబాద్‌‌‌‌లో 21 శాతం పెరుగుదల
  •     ఆఫీసులకు డిమాండ్​ 71 శాతం అప్​​
  •     నైట్ ఫ్రాంక్ రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ:  ఈ ఏడాది జనవరి–-జూన్‌‌‌‌లో భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉత్సాహంగా ఉంది. ఇండ్ల విక్రయాలు 11 సంవత్సరాల గరిష్ట స్థాయి.. 1.73 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. రియల్టీ కన్సల్టెంట్​ నైట్ ఫ్రాంక్ రిపోర్ట్​ ప్రకారం.. ఎనిమిది ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో 34.7 మిలియన్ చదరపు అడుగుల ఆఫీసు జాగా అమ్ముడయింది.   వార్షిక ప్రాతిపదికన ఇండ్ల విక్రయాలు 11 శాతం పెరిగి 1,73,241 యూనిట్లకు చేరుకోగా, ఈ ఏడాది జనవరి–-జూన్‌‌‌‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 33 శాతం పెరిగి 34.7 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.  

నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్  మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ బలమైన ఆర్థిక మూలాధారాలు,  స్థిరమైన రాజకీయ పరిస్థితుల కారణంగా గత కొన్ని క్వార్టర్ల నుంచి భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎదుగుతోందని చెప్పారు. రెసిడెన్షియల్‌‌‌‌, ఆఫీస్‌‌‌‌ సెగ్మెంట్లు దశాబ్దాల స్థాయికి చేరాయని అన్నారు.  2024 మొదటి ఆర్నెళ్లలో ప్రీమియం హౌసింగ్ వాటా మొత్తం అమ్మకాలలో 34 శాతంగా ఉందని పేర్కొన్నారు.

నగరాల వారీగా వివరాలు...

1. ఈ ఏడాది జనవరి-–జూన్​లో ముంబైలో ఇండ్ల విక్రయాలు వార్షికంగా 16 శాతం పెరిగి 47,259 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే నగరంలో ఆఫీసు స్థలాన్ని లీజుకు ఇవ్వడం 79 శాతం పెరిగి 5.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.

2. ఢిల్లీ-–ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌లో ఇండ్ల సేల్స్​ 4 శాతం క్షీణించి 28,998 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే ఆఫీస్ స్పేస్ డిమాండ్ 11.5 శాతం పెరిగి 5.7 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.

3.  ఇండ్ల అమ్మకాల్లో  బెంగళూరు 4 శాతం వృద్ధిని సాధించింది. ఇక్కడ 27,404 యూనిట్లు అమ్ముడయ్యాయి.  ఆఫీస్ డిమాండ్ 21 శాతం పెరిగి 8.4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.

4. పూణేలో ఇండ్ల విక్రయాలు 13 శాతం పెరిగి 24,525 యూనిట్లకు చేరుకోగా, ఆఫీస్ స్పేస్ లీజు 88 శాతం పెరిగి 4.4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.

5. చెన్నైలో నివాస ప్రాపర్టీల విక్రయాలు 12 శాతం వృద్ధితో 7,975 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే  ఆఫీస్ డిమాండ్ 33 శాతం పడిపోయి 3 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.

6.  హైదరాబాద్‌‌‌‌లో ఇండ్ల విక్రయాలు 21 శాతం పెరిగి 18,573 యూనిట్లకు చేరుకోగా, ఆఫీస్ డిమాండ్ 71 శాతం పెరిగి 5 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.

7.  కోల్‌‌‌‌కతా ఇండ్ల విక్రయాలు 25 శాతం వృద్ధితో 9,130 ​​యూనిట్లకు చేరుకున్నాయి. నగరంలో ఆఫీసు స్థలాల లీజింగ్​23 శాతం పెరిగి 0.7 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.

8. అహ్మదాబాద్‌‌‌‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల విక్రయాలు  17 శాతం పెరిగి 9,377 యూనిట్లకు చేరుకున్నాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ కూడా పెరిగింది.