గ్రేటర్ హైదరాబాద్ సిటీ జనం ఇంట్రెస్ట్
60 శాతం కోవిడ్ రానివాళ్లే
డాక్టర్లు, క్యూర్ అయిన కరోనా పేషంట్లు కూడా..
రూ.2500 నుంచి ప్యాకేజీలు స్టార్ట్
హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ముఖానికి మాస్క్, చేతులకు శానిటైజేషన్ కంపల్సరీ. అలాగే ఎటైనా వెళ్లి ఇంటికొచ్చినా వెంటనే ఫ్రెష్ అవడం, ఏవైనా సామాన్లు ఇంటిలోకి తీసుకొచ్చినా వాటిని కూడా శానిటైజేషన్ చేయడం మస్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో బయట నుంచి తెచ్చే వస్తువులతో పాటు తమ చుట్టు పక్కల పరిసరాలు కూడా క్లీన్ గా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు సిటీజనాలు. వైరస్ భయంతో ఇంటిని శానిటైజేషన్, క్లీనింగ్ చేయించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో కోవిడ్ పాజిటివ్ వచ్చి క్యూర్ అయిన పేషెంట్స్ కంటే కూడా వైరస్ సోకని వారే ఎక్కువగా హోమ్ శానిటైజేషన్, క్లీనింగ్ చేయించుకుంటున్నారు. కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో జనాల్లో జాగ్రత్త ఎక్కువైంది. దీన్ని దృష్టిలో పెట్టు కుని సిటీలోని పలు హోమ్ క్లీనింగ్ సంస్థలు క్లీనింగ్ తో పాటు శానిటైజేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంటిని బట్టి ప్యాకేజీలు ఉంటాయని, రూ.2500 నుంచి తమ సేవలు మొదలవుతున్నాయని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.
వారి నుంచే ఎక్కువ ఆర్డర్స్
సిటీలో ఇండివిజ్యువల్ హౌజ్ ల కంటే అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీసే ఎక్కువ. దీంతో అపార్ట్‌మెంట్స్‌లో ఒక్కరికి కరోనా వచ్చినా బిల్డింగ్, బ్లాక్ అంతా శానిటైజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమ ఎదురింట్లో వారికి వైరస్ ఉందనో, ఒకటే లిఫ్ట్ వాడటం వల్ల తమకు కూడా వచ్చిందనే భయంతోనో ఇంటిని, చుట్టూ పరిసరాలను శానిటైజ్, క్లీన్ చేయించుకుంటున్నారు. డోర్ స్టెప్ నుంచి ఇంటిలోని ప్రతి రూమ్, ప్రతి ఒక్క వస్తువును డిస్ ఇన్ఫెక్ట్ చేయించుకునేందుకే మొగ్గుచూపుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చి హాస్పిటల్ లో ట్రీట్మెంట్తీసుకుని క్యూర్ అయి ఇంటికి వచ్చిన వారూ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే వారితో పోలిస్తే 60శాతం నాన్ కోవిడ్ వారి నుంచే ఎక్కువగా ఎంక్వైరీలు, ఆర్డర్స్ వస్తున్నాయని హోమ్ క్లీనింగ్, శానిటైజేషన్ సంస్థలకు చెందిన వారు చెబుతున్నారు.
డోంట్‌వర్రీ ..బీ హ్యాపీ
సిటీలో లాక్ డౌన్ టైంలో పదుల సంఖ్యలో హోమ్ శానిటైజేషన్ స్టార్టప్ లు ఏర్పడ్డాయి. ఈ స్టార్టప్ లు ప్రొఫెషనల్ కెమికల్స్, మిషన్స్ తో శానిటైజేషన్, క్లీనింగ్ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఒక్కో స్టార్టప్ ప్రతి రోజు పదికి పైగా ఎంక్వైరీ కాల్స్, అలాగే ఐదు నుంచి ఆరు ఆర్డర్స్ తీసుకుంటున్నాయి. ఇంటిని పూర్తిగా డిస్ ఇన్ఫెక్ట్, క్లీన్ చేయడానికి టైం పడుతుందని రైజ్ అండ్ షైన్ ఫెసిలిటీ సర్వీసెస్ డిస్ ఇన్ఫెక్షన్ శానిటైజేషన్ సంస్థ ప్రతినిధి తెలిపారు. హోమ్ శానిటైజేషన్ చేయడానికి కంపెనీ నుంచి ఇద్దరిని ఒక టీం గా పంపిస్తారు. వారు పీపీఈ కిట్స్ వేసుకుని కస్టమర్ ఇంటికి వెళ్లి సీలింగ్ మొదలుకొని వాల్స్, కప్ బోర్డ్స్, సోఫాలు, రూమ్స్, వాష్ రూమ్స్ ఇలా అన్నింటిని కెమికల్ స్ప్రే తో డిస్ ఇన్ఫెక్ట్ చేస్తారు. ఇవి ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్ అవడం వల్ల క్లాత్స్, కిచెన్ లోని సామాన్లపై ఎఫెక్ట్ ఉండదని, క్లీన్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇంటి సైజ్ ని బట్టి 30నిమిషాల నుంచి గంట పాటు టైం పడుతుందంటున్నారు. 1 బీ హెచ్ కే కి 2500, 2 బీహెచ్ కే 3500, 3బీహెచ్ కి 4500 ఛార్జ్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ హౌజెస్ కి ఎస్ఎఫ్ టీ కి 2 రూపాయల నుంచి 3 రూపాయలు వసూలు చేస్తున్నారు.
పీపీఈ కిట్స్ తో వద్దంటున్నరు
మా సిబ్బంది పీపీఈ కిట్స్ వేసుకుని వెళుతున్నారు. కానీ పాజిటివ్ వచ్చినా, నెగిటివ్ వచ్చినా పీపీఈ కిట్స్ వల్ల కరోనా వచ్చిందని అందరూ భావిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల వాళ్లకి భయపడి పీపీఈ కిట్స్ తో రావొద్దని, మాస్క్ వేసుకుని రమ్మని కస్టమర్లు చెబుతున్నారు. వంద శాతంలో 60- నుంచి 70 శాతం కస్టమర్లు ఇదే చెబుతున్నారు. అయితే స్టాఫ్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాపర్ కేర్ తీసుకుని పంపిస్తున్నాం. ఇప్పటి వరకు వందకు పైగా హౌజ్ లలో శానిటైజేషన్, క్లీనింగ్ చేశాం. డిస్ ఇన్ఫెక్షన్ చేశాక ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇల్లు క్లీన్ చేసుకోవాలి. లేదంటే కెమికల్ యూజెస్ ఉండదు.-శామ్యుల్ , రైజ్ అండ్ షైన్ ఫెసిలిటీ సర్వీసెస్ డిసిన్ఫెక్షన్, డీప్ క్లీనింగ్
ఎంక్వైరీలు వస్తున్నాయి.
లాక్ డౌన్ తో మా ఆయన ఉద్యోగం పోయింది. జనాలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ, శానిటైజేషన్ మీద ఫోకస్ చేస్తుండటంతో ఈ స్టార్టప్ మొదలుపెట్టాం . మొదట్లో వచ్చినన్ని ఆర్డర్స్ ఇప్పుడు లేవు. డిస్ ఇన్ఫెక్షన్ లిక్విడ్ తో ఇంటిని శానిటైజ్ చేస్తాం. 20లీటర్ల స్ప్రే క్యాన్ 3వేలు ఉంటుంది. సర్వీస్ ఛార్జ్ 500. ఒక్కో ఇంటికి 3500లు ఛార్జ్ చేస్తున్నాం. ఇప్పటివరకు 40కి పైగా ఇళ్లలో డిస్ ఇన్ఫెక్షన్, క్లీనింగ్ చేశాం. ఒకసారి చేయించుకున్న తర్వాత మళ్లీ నెలకి చేయించుకుంటే మంచిది. కానీ మాకు రీ- ఎంక్వైరీలు రావడంలేదు. పాజిటివ్ వచ్చి క్యూర్ అయిన వారితో పాటు డాక్టర్స్ ముందు జాగ్రత్తలో హౌజ్ డిస్ ఇన్ఫెక్షన్ చేయించుకుంటున్నారు.
– పెరుమాల్ల నాగలక్ష్మి , హోమ్ శానిటైజేషన్ సర్వీసెస్, కూకట్పల్లి.