- టూరిస్టులకు ఇండ్లలోనే నివాసం, భోజన వసతి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలుకు శ్రీకారం
- జిల్లా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాల్లోని గ్రామాలకు ప్రాధాన్యం
హనుమకొండ, వెలుగు: చారిత్రక కట్టడాలు.. పురాతన ఆలయాలు.. ప్రకృతిసిద్ధ పర్యాటక ప్రాంతాలకు నిలయం తెలంగాణ. అందుకే దేశ, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులకు స్థానికులే విడిది కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రం ఒక పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్’ పేరుతో టూరిస్టులకు ‘హోం స్టే’ కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించింది. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ మేరకు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు హోం స్టే ఎస్టాబ్లిష్ మెంట్ కోసం టూరిస్ట్ ప్లేస్లు ఉన్న గ్రామాల్లోని ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పర్యాటకులకు ఇంటి వాతావరణం..
ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం టూరిస్ట్ ప్లేసులు, గ్రామీణ ప్రాంతాల సందర్శనకు వచ్చి స్టే చేయాలనుకునే పర్యాటకులకు ఇంటి వాతావరణంకల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టూరిస్ట్ ప్లేసులు చూసేందుకు వచ్చే వారికి ఇంట్లోనే విడిది(హోం స్టే) కల్పించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ట్రైబల్ విలేజ్లకు ప్రాధాన్యం ఇస్తుండగా.. జిల్లా కేంద్రాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, టూరిస్ట్ ప్లేసులు ఉన్న ఏ గ్రామంలోనైనా హోం స్టేకు ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది. ఇదిలాఉంటే హోం స్టేకు వచ్చిన టూరిస్టులకు ఆ ఇంటి ఓనర్స్ అక్కడే ఆవాసం కల్పించడంతో పాటు బయటి ఫుడ్ ను కాకుండా స్థానికంగా వండిన ఆహారం అందించాల్సి ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విజిటర్స్ కు స్థానిక ఆహార పదార్థాలను పరిచయం చేయడంతో పాటు పర్యాటక అనుభూతిని కల్పించాల్సి ఉంటుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం..
హోం స్టే కల్పించే నిర్వాహకులు టూరిస్టులకు విడిది కల్పించేందుకు అన్ని సౌకర్యాలతో ప్రత్యేకంగా కనీసం ఒక గదినైనా కేటాయించగలగాలి. అంతకుమించి రూమ్స్ ఉంటే వచ్చే టూరిస్టులను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. క్లీన్ అట్మాస్పియర్ తో పాటు టూరిస్టులకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలి. హోం స్టే కల్పించే ఔత్సాహికులు ముందుగా తెలంగాణ టూరిజం హోం స్టే ఎస్టాబ్లిష్మెంట్లో ఎన్రోల్ కావాల్సి ఉంటుంది. అనంతరం తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీసర్ల కమిటీ ‘హోం స్టే’ను పరిశీలించి, గైడ్లైన్స్ ప్రకారం ఏర్పాట్లు ఉన్నాయో లేవో చెక్ చేస్తుంది. ఆ తరువాత టూరిజం డిపార్ట్మెంట్ లో రిజిస్టర్ చేస్తుంది. కాగా హోం స్టే కల్పించేందుకు అప్లికేషన్ పెట్టుకున్న తరువాత ప్రత్యేక గదుల ఏర్పాటు, రిపేర్లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థికసాయం కూడా అందజేస్తాయి.
సౌలతులను బట్టి చార్జీలు
హోం స్టే లో కల్పించే వసతులను బట్టి టూరిజం కమిటీ దానిని గోల్డ్, సిల్వర్ కేటగిరీలుగా విభజిస్తుంది. ఆ తరువాత హోం స్టేలో కల్పించే బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఎలాంటి ఆహారం అందిస్తారో.. దానికి సంబంధించిన చార్జీలను కూడా అక్కడ డిస్ప్లే చేయాలి. ఆ వివరాలన్నీ టూరిజం డిపార్ట్మెంట్కు అందిస్తే.. పర్యాటకులకు ముందస్తుగా తెలియజేసి ‘హోం స్టే’కు వారిని అనుమతిస్తుంది. కాగా, టూరిస్టులకు హోం స్టేను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండగా, జిల్లా కేంద్రాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాల్లోని ఔత్సాహికులు ఇందుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ‘www.telanganatourism.gov.in’ వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టుకోవాలని, పూర్తి వివరాలకు స్థానిక టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీస్లో సంప్రదించాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు.