
ఏపీలోని అల్లూరి జిల్లాలో అనుకోని ఘటన చోటు చేసుకుంది.. అంతిమయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అంతిమయాత్ర జరుగుతుండగా.. తేనెటీగలు దాడి చేయటంతో శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి బంధువులంతా పరుగులు తీశారు. శుక్రవారం ( మార్చి 28 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. అల్లూరి జిల్లాలోని గన్నేరు కొయ్యపాడులో కొప్పుల పల్లాయమ్మ (86) మృతి చెందడంతో శుక్రవారం ఉదయం బంధువులు అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో బాణాసంచా కాల్చడంతో ఘటన చోటు చేసుకుంది.
టపాకాయ చెట్టుపై ఉన్న తేనెతుట్టుపై పడటంతో తేనెటీగలు ఒక్కసారిగా అంతిమయాత్రలో ఉన్నవారిపై దాడి చేశాయి.దీంతో వారంతా మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పరుగులు తీశారు. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను గౌరీదేవిపేట PHCకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొంతమందికి భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తేనెటీగల దాడితో ఉలిక్కిపడ్డ బంధువులు.. తేనెటీగలు వెళ్లాక అంత్యక్రియలు పూర్తి చేశారు. చావుకు వెళ్తే చచ్చినంత పనయ్యిందని అనుకున్నారు బంధువులు.