హాంకాంగ్ డిమాండ్: పూర్తి స్వేచ్ఛ

హాంకాంగ్ డిమాండ్: పూర్తి స్వేచ్ఛ

చైనా పెత్తందారీతనానికి నిరసనగా హాంకాంగ్​ ఉద్యమిస్తోంది. మొదట నేరస్తుల అప్పగింతకు వ్యతిరేకంగా ఆరంభమైన ఉద్యమం… ఇప్పుడు చైనా నుంచి విముక్తిని కోరుకునేలా మారింది. అంతర్జాతీయంగా తమ సమస్య తెలియాలన్న ఉద్దేశంతో ఎయిర్​పోర్టును రెండు రోజులపాటు చుట్టుముట్టేశారు. ఒక్క విమానాన్నయినా ఎగరనివ్వలేదు, దిగనివ్వలేదు. దీంతో కంగుతిన్న చైనా అణచివేతకు పన్నాగం పన్నుతోంది. శాంతియుతమైన ఉద్యమానికి వయొలెన్స్​ కోటింగ్​ ఇవ్వబోతోంది. ముప్పయ్యేళ్ల క్రితం తియనాన్మెన్​ స్క్వేర్​లో చేసినట్లే… ఇప్పుడు హాంకాంగ్​లో కూడా చేయనుందని పరిశీలకులు అంటున్నారు. 

రెండున్నర నెలలుగా జరుగుతున్న హాంకాంగ్ ఉద్యమం కొత్త రూటు పట్టింది. ఉద్యమకారుల డిమాండ్లు మారాయి. 10–12 వారాల క్రితం ‘నేరస్తుల అప్పగింత బిల్లు (ఎక్స్​ట్రాడిషన్​)’కు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం… ఇప్పుడు చైనానుంచి పూర్తి  స్వాతంత్ర్యం దిశగా మళ్లింది. కొత్త డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. హాంకాంగ్ మూల చట్టాన్ని (బేసిక్ లా) కాపాడుకోవడమే ప్రస్తుతం ప్రధాన డిమాండ్​గా మారింది. బేసిక్ లా అనేది బ్రిటిషర్లు హాంకాంగ్​ని లీజ్​కి తీసుకున్నప్పుడు రూపొందించింది. హాంకాంగ్​  పూర్తి ప్రజాస్వామ్య హక్కులకు ఇది గ్యారంటీ ఇస్తుంది. ‘పూర్తి  ప్రజాస్వామ్యాన్ని’ కల్పిస్తుంది. బేసిక్ లా అంటే అనధికారికంగా హాంకాంగ్ రాజ్యాంగం వంటిది. చైనాలో భాగంగా ఉన్నప్పటికీ ఈ హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని నిరసనకారులు తేల్చి చెబుతున్నారు. దీంతోపాటు పోలీసులు ప్రవర్తించిన తీరును కూడా నిరసనకారులు ఇష్యూ చేశారు.

హాంకాంగ్ బేసిక్ లా ను పట్టించుకోని బీజింగ్

హాంకాంగ్ ప్రజాస్వామ్య హక్కులకు పూచీకత్తుగా నిలిచే బేసిక్ లా విషయంలో తాము జోక్యం చేసుకోబోమని గతంలో చైనా పాలకులు హామీ ఇచ్చారు. బ్రిటిషర్ల లీజు ముగిసిపోయి, చైనా అజమాయిషీలోకి వచ్చినప్పుడు ఇచ్చిన ఈ హామీ  వట్టిమాటలకే పరిమితమైంది. కొన్నేళ్లుగా హాంకాంగ్ వాసులపట్ల చైనా పాలకుల తీరు మారింది.  బేసిక్ లాలో జోక్యం చేసుకోవడం మొదలెట్టారు. హాంకాంగ్​పై తమకు పూర్తి అధికారాలు ఉన్నాయంటున్నారు బీజింగ్ పాలకులు. ఈ పరిస్థితుల్లో చైనా పాలకుల తీరుకు నిరసనగా హాంకాంగ్ ప్రజలు మరింత రెచ్చి పోతున్నారు.

నేరస్తుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా రెండున్నర నెలలుగా హాంకాంగ్​లో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం తమకు ప్రసాదించిన ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడానికి  నిరసనకారులు కొత్త పంథా మొదలెట్టారు. లేటెస్ట్​గా దేశ విదేశాల ప్రయాణీకులతో రద్దీగా ఉండే హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును నిరసనకారులు టార్గెట్​గా చేసుకున్నారు.

దేశ ఎకానమీపై నెగెటివ్ ప్రభావం

ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్ పోర్టుగా హాంకాంగ్ విమానాశ్రయానికి పేరుంది. ఇక్కడకు విదేశీ ప్రయాణీకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ప్రతిరోజూ దాదాపు 1,100 పైచిలుకు పాసింజర్​, కార్గో విమానాలు ఈ విమానాశ్రయం గుండా  ప్రయాణిస్తుంటాయి. హాంకాంగ్ జీడీపీకి ఈ ఎయిర్ పోర్టు తన వంతు షేర్​గా ఐదు శాతం కంట్రిబ్యూట్ చేస్తోంది. ఇంత ముఖ్యమైన  ఎయిర్ పోర్టును నిరసనలకు కేంద్రంగా చేసుకోవడమంటే హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థను కుదిపేయడమేనంటున్నారు నిపుణులు. దేశం పెద్ద ఎత్తున ఫారిన్ ఎక్స్ఛేంజ్​ను కోల్పోతుందన్నారు.

ఉద్యమంలోకి సర్కారీ మనుషులు

ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న  ఉద్యమంలోకి చైనా ప్రభుత్వం తమ మనుషులను చొప్పించిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. నిరసనకారుల్లో వీరు కలిసిపోయే ఉద్యమ లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేయడమే వీరి పనిగా కనిపిస్తోంది. పోలీసులపై  రాళ్లు రువ్వడం వంటి  రెచ్చగొట్టే పనులను బీజింగ్ సర్కార్ వీరిని అప్పగించినట్లు తెలుస్తోంది. గుంపులో కలిసిపోయి ఉద్యమాన్ని  హింసావాదం వైపు మళ్లించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఉద్యమం పై ఆందోళనకారులు పట్టుకోల్పోయేలా చేయడమే వీరి మెయిన్ టార్గెట్ అని వార్తలు వస్తున్నాయి. ఎయిర్ పోర్టులో జరిగిన బీభత్సంలో ఈ సర్కారీ మనుషులే పాల్గొన్నట్లు వార్తలందాయి. ఫలితంగా నిరసనలు  దారి తప్పితే ఆ నెపాన్ని ఆందోళనకారులపై వేసి, ప్రజల్లో అసలు ఉద్యమానికే నెగెటివ్ ఇమేజ్ తీసుకురావడమే  చైనా ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.

హాంకాంగ్​పై సైనిక చర్య తప్పదా?

హాంకాంగ్​లో జూన్ నుంచి నిరసనలు మొదలయ్యాయి. నేరస్తుల అప్పగింత బిల్లుపై నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చినా శాంతియుతంగానే ఉద్యమం సాగింది. అయితే ఇప్పుడు ‘పూర్తి స్వేచ్ఛ’ అంశం తెరమీదకు రావడంతో నిరసనల ఉధృతి పెరిగింది. ఈ పరిస్థితిని బీజింగ్ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తే సైనిక చర్యకు చైనా వెనకాడదని చెబుతున్నారు..

అమెరికాపై అనుమానం

హాంకాంగ్ ప్రజల ఉద్యమం వెనక అమెరికా ఉందని చైనా ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా కూడా హాంకాంగ్  పరిణామాలపై ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతోంది. “ ప్రజాస్వామిక హక్కుల కోసం హాంకాంగ్ ప్రజలు జరుపుతున్న పోరాటాన్ని తొక్కేయడం ఈజీ కా’’దని అమెరికా అంటోంది. చైనా గతంలో ఎన్నో ఉద్యమాలు అణచివేసి ఉండొచ్చు. అయితే ఈసారి హాంకాంగ్ ప్రజల గొంతును నొక్కేయడం అనుకున్నంత ఈజీ కా”దని చైనాలో రాయబారిగా పనిచేసిన మ్యాక్స్ బౌకస్ కామెంట్ చేశారు. అంతేకాదు హాంకాంగ్ లో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారిని అమెరికా విదేశీ వ్యవహారాలకు  చెందిన అధికారులు అనేక సార్లు కలిసినట్లు వార్తలందాయి. కేవలం అధికారులే కాదు అమెరికా పొలిటికల్ లీడర్లు కూడా ఉద్యమకారులతో  భేటీ అయినట్లు బీజింగ్ సర్కార్ కు సమాచారం అందింది. దీంతో తమ ఆధీనంలో ఉన్న హాంకాంగ్ లో హక్కుల పేరుతో చిచ్చు పెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా పాలకులు భావిస్తున్నారు.  చైనాకు కొంతకాలంగా అమెరికాతో  ట్రేడ్ వార్ నడుస్తోంది. ఈ  ట్రేడ్ వార్ నేపథ్యంలో తమను ఇరుకున పెట్టడానికి  అమెరికా లోపాయికారీగా పావులు కదుపుతోందని చైనా  నమ్ముతోంది. హాంకాంగ్ పరిణామాలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ కూడా చైనా ఇలా నమ్మడానికి కారణమైంది.