బిల్లు వెనక్కి, మరి హాంకాంగ్ చల్లారేనా?

చైనా ఆధీనంలో ఉన్నప్పటికీ హాంకాంగ్ కు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. హాంకాంగ్ చిన్న దేశమైనా ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ. ‘ ఫైనాన్షియల్  హబ్ ’ గా ఆసియాలో బాగా పాపులర్. దేశ జనాభా కోటి దాటకపోయినా, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న దేశాల్లో హాంకాంగ్ ఒకటి. ఇక్కడి ప్రజలు బాగా రిచ్. బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఆ ప్రభావం దేశ ఎకానమీ పై పడింది. హాంకాంగ్ లో ప్రతి రోజూ నిరసన ప్రదర్శనలే. ఉద్యమకారుల నినాదాలతో వీథులు హోరెత్తేవి. వీరిని అణచివేయడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉండేవి. ఏ క్షణం ఏమవుతుందోనన్న టెన్షన్ ఉండేది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ బిజినెస్ చేయడానికి బయటిదేశాల నుంచి ఎవరూ వచ్చేవారు కాదు. దాదాపు మూడు నెలలుగా బిజినెస్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి. పరిస్థితి ఇలాగే మరికొంత కాలం కొనసాగితే హాంకాంగ్ కున్న ‘ ఫైనాన్షియల్  హబ్ ’ అనే పేరు శాశ్వతంగా తొలగిపోయే అవకాశాలు నెలకొన్నాయి. దీంతో  చైనా పాలకులు దిగొచ్చారు. ఉద్యమకారులను శాంతింప చేయాలన్న నిర్ణయానికి రాక తప్పలేదు. ఇందులో భాగంగానే వివాదానికి మూలమైన నేరస్తుల అప్పగింత బిల్లును పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు  హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న క్యారీ లాంతో  స్టేట్ మెంట్ ఇప్పించారన్న కథనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

చేయిదాటి పోయే పరిస్థితి వచ్చిందా ?

ఉద్యమకారులను అణచివేయడానికి  చైనా ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. హాంకాంగ్ లో ఏ మూల చూసినా పెద్ద ఎత్తున బలగాలను మోహరించి, ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న లీడర్లను లొంగిపోయేలా చూడాలని ప్రయత్నించింది. కానీ చైనా పాలకుల ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. రోజులు గడిచేకొద్దీ  ఉద్యమం కొత్త ప్రాంతాలకు విస్తరించింది.

పూర్తి ప్రజాస్వామ్య హక్కుల దిశగా..

నేరస్తుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం చివరకు ప్రజాస్వామ్య హక్కుల సాధన వైపు మారింది. చైనా నుంచి పూర్తి స్వాతంత్ర్యం దిశగా  మళ్లింది. హాంకాంగ్ మూల చట్టాన్ని కాపాడుకోవడమే ప్రధాన డిమాండ్ గా ఉద్యమం సాగింది. దీంతో చేయిదాటి పోయే పరిస్థితి వచ్చిందన్న సంగతి చైనాకు బాగా అర్థమైంది. భేషజాలకు పోయి పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం కరెక్ట్ కాదని నిర్ణయించుకుంది. మొదట హాంకాంగ్ లో మామూలు  పరిస్థితులు నెలకొనేలా చేయడానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని డిసైడయింది.

ఇంటర్నేషనల్ ఇష్యూగా హాంకాంగ్

మూడు నెలలుగా  ఇంటర్నేషనల్ గా అందరి చూపు హాంకాంగ్ పైనే పడింది. హాంకాంగ్ వాసులకు బేసిక్ లా  ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులను ఉక్కుపాదంతో అణచివేయాలని చైనా ప్రయత్నిస్తోందన్న విమర్శలు బాగా వచ్చాయి. చైనా ఖాతాలో  ఇప్పటికే అంతర్జాతీయంగా అనేక గొడవలున్నాయి. అమెరికాతో ఒక వైపు ట్రేడ్ వార్ నడుస్తోంది. మరో వైపు ఆసియాలో పెద్దన్న పాత్ర పోషించడానికి సరిహద్దుల్లో ఇండియాతో చీటికిమాటికి కాలు దువ్వుతోంది. డోక్లా ఎపిసోడ్ సుఖాంతమైనా చైనా మైండ్ సెట్ లో మార్పు రాలేదు. కొన్ని రోజుల కిందట ఇండియా సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను దింపి టెన్షన్ కు తెరలేపింది. ఇది ఇంకా హద్దు మీరితే హాంకాంగ్ తమ చేతుల్లో నుంచి పూర్తిగా జారిపోతుందని  చైనా భయపడింది.  ఈ పరిస్థితుల్లో ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా  అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకునే పరిస్థితి చైనాకు వచ్చిందంటున్నారు ఎనలిస్టులు. ఈ  పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేరస్తుల అప్పగింత బిల్లును  చైనా వెనక్కి తీసుకున్నట్లు  ఎనలిస్టులు చెబుతున్నారు. ఇవన్నీ గమనిస్తే, హాంకాంగ్ లో ఆందోళనలు చల్లారుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.

ఏంటీ ఈ బిల్లు?

హాంకాంగ్ సహజంగా  ప్రశాంతంగా ఉండే దేశం. చైనా ప్రతిపాదించిన నేరస్తుల అప్పగింత బిల్లుతో ఇక్కడి ప్రశాంతత ఒక్కసారిగా ఆవిరైంది. హాంకాంగ్ లో బ్రిటన్ ఆధారిత జ్యుడీషియరీ సిస్టమ్ అమలవుతోంది. దీని స్థానంలో చైనా తన న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తీసుకురాదలచిందే నేరస్తుల అప్పగింత బిల్లు. హాంకాంగ్ లో నేరారోపణలు ఎదుర్కొనే వారంతా ఇకపై కేసు విచారణ కోసం చైనాలోని కోర్టులకు వెళ్లాలనేది ఈ బిల్లులోని అసలు విషయం. పాలన పరంగాచైనా ఆధీనంలో ఉన్నప్పటికీ  హాంకాంగ్ కు కొన్ని ప్రత్యేక హక్కులున్నాయి. చైనా ప్రతిపాదించిన బిల్లు, చట్టంగా మారితే బేసిక్ లా ప్రకారం హంకాంగ్ తన ప్రత్యేక హక్కులు కోల్పోతుందన్నది ఆందోళనకారుల వాదన. ఈ బిల్లును అడ్డం పెట్టుకుని హంకాంగ్ అన్ని హక్కులను కాలరాయాలన్నది బీజింగ్ సర్కార్ ప్లాన్ అని నిరసనకారులు వాదించారు. బిల్లును ఎత్తేసేంతవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తెగేసి చెప్పారు ఆందోళనకారులు.

ఆందోళనకారులు ఏమంటున్నారు?

చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లాం ప్రకటనపై ఆందోళనకారుల్లో వేర్వేరు అభిప్రాయాలు వస్తున్నాయి. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న లీడర్లు, హాంకాంగ్ నాయకురాలి  స్టేట్ మెంట్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ‘‘ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమాన్ని నీరు గార్చడానికి  ఇదొక ఎత్తుగడ ” అంటున్నారు. “ ఎప్పుడో చేయాల్సిన పనిని క్యారీ లాం ఇప్పుడు చేస్తున్నారు ”అని ఉద్యమకారుడు జోషువా వాంగ్ అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న సామాన్య ప్రజలైతే, పరిస్థితి ఇప్పటికైనా సద్దుమణిగితే బావుండుననే ధోరణితో ఉన్నారు.