గల్ఫ్ కార్మికులకు ‘అభయం’..ఎన్నికల హామీ నెరవేర్చిన కాంగ్రెస్ సర్కార్

గల్ఫ్ కార్మికులకు ‘అభయం’..ఎన్నికల హామీ నెరవేర్చిన కాంగ్రెస్ సర్కార్
  • పదేండ్లలో మరిచిన బీఆర్ఎస్ పాలకులు 
  • గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి జీవో. 205 రిలీజ్
  • 160 మంది మృతుల కుటుంబాలకు రూ. 6.45 కోట్లు మంజూరు
  • ప్రజాభవన్ లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహణ 
  • గల్ఫ్ కార్మిక, బాధిత కుటుంబాల్లో వ్యక్తమవుతున్న ఆనందం 

జగిత్యాల, వెలుగు : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కాంగ్రెస్ సర్కార్ అభయహస్తం అందిస్తోంది. ఏండ్లుగా సాయం కోసం ఎదురు చూస్తుండగా ప్రస్తుత సాయం అందిస్తూ భరోసా ఇస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈనెల 20న వేములవాడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి17 మంది గల్ఫ్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. దీంతో గల్ఫ్ కార్మికులు, బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 

పదేండ్లు మరచిన బీఆర్ఎస్ 

విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం గల్ఫ్ దేశాల్లో తెలంగాణ చెందిన కార్మికుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంది.  ఇందులో 10 లక్షల మంది ఉత్తర తెలంగాణకు చెందిన వారే ఉన్నారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చెందిన వారు మరో 5 లక్షల మంది ఉంటారు. ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయిస్తామని  అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 2014, 2018 ఎన్నికల మ్యానిఫెస్టోల్లోనూ పెట్టింది. గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నో హామీలు ఇచ్చింది.  పదేండ్ల పాలనలో చివరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల  హామీల్లో భాగంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో కనీసం ఎన్ఆర్ఐ పాలసీ అంశం లేకపోవడంతో గల్ఫ్ కార్మికులు తీవ్ర నిరాశ చెందారు. దీంతో  కామారెడ్డి, సిరిసిల్ల సెగ్మెంట్లలో కేసీఆర్, కేటీఆర్ పై గల్ఫ్ కార్మికులు పోటీ చేశారు. 

గల్ఫ్ బోర్డు, ఎన్నారై పాలసీపై ముందడుగు 

గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం పేరుతో ఇచ్చిన నాలుగు అంశాలపై జీఓలు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సెప్టెంబర్16న జీవో నం. 205 జారీ చేసింది. అదేవిధంగా ప్రజాభవన్ లో ప్రవాసీ ప్రజావాణి కౌంటర్ ను కూడా ఏర్పాటు చేసింది. గల్ఫ్ కుటుంబాల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరిస్తుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై స్టడీ చేసేందుకు సలహా కమిటీని ఏర్పాటు చేసింది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల స్కూల్‌, కాలేజీల్లో అడ్మిషన్లలో ప్రాధాన్యత కల్పించేలా ప్లాన్ కూడా రూపొందిస్తోంది. 

వేములవాడ సభలో ముఖ్యమంత్రి ప్రొసీడింగ్స్ పంపిణీ 

తెలంగాణకు చెందిన కార్మికులు దాదాపు 160 మంది గల్ఫ్ దేశాల్లో మృతి చెందినట్లు రాష్ట్ర సర్కార్ గుర్తించింది. గతేడాది డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు చనిపోయిన కార్మికులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు గత అక్టోబర్ 21న రాష్ట్ర సర్కార్ జీఏడీ ఎన్నారై వింగ్ నుంచి రూ. 6.45 కోట్ల నిధులను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు మంజూరు చేసింది. ఇందులోభాగంగా వేములవాడ సభలో ముఖ్యమంత్రి సిరిసిల్ల జిల్లాకు చెందిన 17 మంది బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రొసీడింగ్స్ అందజేశారు. ట్రెజరీ ద్వారా నేరుగా బ్యాంకు అకౌంట్లలోకి బదిలీ అవుతాయి. దేశంలో ఎక్స్ గ్రేషియా అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.