
నేడు జాతీయ అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల దినోత్సవం
జనగామ, వెలుగు: గాయపడిన, తీవ్ర అనారోగ్యం పాలైన వారికి అత్యంత కీలకమైన తొలి గంటలో ప్రాణాలు కాపాడుతూ 108 సిబ్బంది ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. జనగామ జిల్లాలో 12 మండలాలు ఉండగా, 11 అంబులెన్స్ లు పనిచేస్తున్నాయి. వీటిలో 22 మంది ఈఎంటీలు, (ఎమర్జెన్సీ మెడికల్ టెక్సీషియన్లు) డ్రైవర్లు సేవలు అందిస్తున్నారు. క్షతగాత్రులకు తొలి గంటలో ప్రాథమిక చికిత్సలు చేస్తూ హాస్పిటల్లకు వచ్చే వరకు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో మూడు నెలల్లో 3750 మందికి ఎమర్జెన్సీ సేవలను 108 సిబ్బంది అందించారు.
జనవరిలో 1250 ఎమర్జెన్సీ సేవలలో 120 ప్రెగ్నెన్సీ, 96 రోడ్డు ప్రమాదాలు, మిగిలినవి గుండె నొప్పి, శ్వాస సంబంధితతో పాటు పాముకాటు తదితరులున్నారు. ఫిబ్రవరిలో 1120 మందికి సేవలు అందించగా, వీరిలో 110 మంది గర్భిణులు, 118 రోడ్డు ప్రమాద బాధితులు తదితరులున్నారు. మార్చిలో 1350 మందికి సేవలందించగా, అందులో 136 మంది గర్భిణులు, 125మంది రోడ్డు ప్రమాద బాధితులకు సేవలందించారు.
108లో పనిచేయడం అదృష్టం
క్షతగాత్రులకు తొలిగంట అత్యంత కీలకం. ఆ గోల్డెన్ అవర్లో ప్రాథమిక చికిత్సలు చేసి ప్రాణాలను కాపాడడంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల సేవలు గొప్పవి. 108లో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నా.
- మంద శ్రీనివాస్, 108 సర్వీసెస్ప్రాజెక్ట్ మేనేజర్, జనగామ