మామునూర్‍ ఎయిర్‍పోర్టుపై మళ్లీ ఆశలు

  • నిర్మాణానికి మరో 253 ఎకరాలు అడిగిన ఏఏఐ
  • నిరుడు మే నెలలో భూములు పరిశీలించిన జిల్లా అధికారులు
  • 373 ఎకరాలు బదలాయించాలని సీఎంను కోరిన కలెక్టర్‍
  • పట్టించుకోని గత బీఆర్‍ఎస్  సర్కారు
  • మంత్రుల రివ్యూలో విమానాశ్రయ టాపిక్‍
  • త్వరలోనే భూములు పరిశీలించనున్న మినిస్టర్లు

వరంగల్, వెలుగు : ఓరుగల్లులోని మామునూర్‍  ఎయిర్‍పోర్టు రీఓపెనింగ్‍ అడుగు దూరంలో ఆగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍ లో పాలకులు వరంగల్‍  ఎయిర్‍పోర్ట్ ను  పట్టించుకోలేదని బీఆర్‍ఎస్‍ పెద్దలు వందల సార్లు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం రాగానే ఎయిర్ పోర్ట్ ను మళ్లీ ప్రారంభిస్తామని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్‍  పదేండ్లు అధికారంలో ఉన్నా ఆ హామీని నెరవేర్చలేదు. అందుబాటులో ఉన్న భూములకు మరిన్ని భూములు అప్పగిస్తే మామునూర్‍లో విమానాలు నడపడానికి తమకు అభ్యంతరంలేదని కేంద్ర ప్రభుత్వం, ఎయిర్‍పోర్ట్  అథారిటీ స్పష్టం చేశాయి. గత కేసీఆర్‍  ప్రభుత్వం ఆ భూములను ఇవ్వకుండా మాటలతో నెట్టుకొచ్చింది. ఎయిర్‍పోర్ట్  రీఓపెన్‍కు అవసరమైన భూముల విషయంలో చివరకు జిల్లా అధికారులు క్లారిటీకి వచ్చారు. ల్యాండ్  అడ్జస్ మెంట్ కు కావాల్సిన అప్రూవల్  ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్‍ కు ఫైల్‍  పంపారు. అయితే.. ఎయిర్‍పోర్ట్  అంశంపై కేసీఆర్‍, కేటీఆర్‍  సభలు, మీటింగుల్లో వాగ్దానాలు చేశారు తప్పితే నిరుడు మే నెలలో పంపిన ఫైల్‍ను పట్టించుకోలేదు. దీంతో ఓరుగల్లు వాసుల మామునూర్‍ ఎయిర్‍పోర్ట్  కల అలాగే ఉండిపోయింది.

దక్షిణాసియాలో పెద్ద ఎయిర్‍పోర్టుగా రికార్డ్

దేశంలో1930లో ఏర్పాటు చేసిన వరంగల్‍ మామునూర్ ఎయిర్‍పోర్టు అప్పట్లో సౌత్  ఏషియాలోనే అతి పెద్దదిగా రికార్డుల్లో ఉంది. దాదాపు వెయ్యి  ఎకరాల స్థలంలో విమానాల రాకపోకలతో 1981 వరకు కళకళలాడింది. చివరి నిజాం మీర్  ఉస్మాన్  అలీ ఖాన్.. సొలాపూర్, కాగజ్ నగర్‍  వంటి ఏరియాల్లో వ్యాపారాలు చేసేందుకు ఇక్కడి నుంచే ప్రయాణాలు సాగించేవారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే క్రమంలో రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు ఇక్కడే ఫ్లైట్  దిగేవారు. ఇండో–చైనా యుద్ధం నేపథ్యంలో టెర్రరిస్టులు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ను టార్గెట్  చేశారు. ఈ క్రమంలో మన విమానాలు పార్కింగ్‍  చేసేందుకు మామునూర్‍లో 1970లో పొడవాటి ఎయిర్‍షిప్‍  (హ్యాంగర్)  నిర్మించారు. 1970 నుంచి 1977 మధ్యలో ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు వాయుదూత్‍  విమానాలు నడిపారు.

ఆశలు రేపిన ఉడాన్‍  స్కీంవరంగల్  ఎయిర్‍పోర్ట్ లో 1981 నుంచి రాకపోకలు బంద్ అవగా 2007లో దీనిని మళ్లీ ఓపెన్‍  చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్‍పోర్ట్  అథారిటీ ఆఫ్  ఇండియా (ఏఏఐ) తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వరంగల్, కడప విమానాశ్రయాల అభివృద్ధికి  ప్రభుత్వాలు రూ.6 కోట్ల నిధులు  మంజూరు చేశాయి. విమానాలు నిలిపేందుకు మామూనూర్‍  రన్‍వే ఎలా ఉందో పరిశీలించేందుకు 2008లో ఏఏఐ అధికారులు సందర్శించారు. 2009లో వరంగల్‍, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, కడప, రాజమండ్రి, తిరుపతి ఎయిర్‍పోర్టుల అభివృద్ధికి అప్పటి ఉమ్మడి ప్రభుత్వం రూ.59 కోట్లు మంజూరు చేసింది. కాగా, మామునూర్‍  ఎయిర్‍పోర్టును మళ్లీ ప్రారంభిస్తామని  హామీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్‍.. తన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్ 27న ఉడాన్  పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు పర్యాటక ప్రాంతాలకు దగ్గర్లో ఉండే పాత విమానాశ్రాయాలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంది. దీంతో అప్పటికే 36 ఏండ్ల క్రితం మూతపడ్డ మామూనూర్ ఎయిర్‍ పోర్టు రీ ఓపెన్‍పై మరోసారి ఆశలు చిగురించాయి.

అథారిటీ ఆఫర్ చేసినా రాష్ట్రం స్పందించలే

మామునూర్ ఎయిర్‍పోర్టుపై పర్యవేక్షణ లేకపోవడంతో భూములు ఆక్రమణకు గురయ్యాయి. ప్రస్తుతం దాదాపు 700 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విమానాశ్రయాన్ని మళ్లీ ప్రారంభించాలంటే 1200 ఎకరాల భూములు అవసరమని, ఇప్పుడున్నవాటికి మిగతా భూములు సేకరించి ఇవ్వాలని ఎయిర్‍పోర్ట్  అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అప్పుడే బోయింగ్‍  వంటి పెద్ద విమానాలు నడపడానికి వీలు ఉంటుందని ఏఏఐ తెలిపింది. కాగా, కేసీఆర్‍ ప్రభుత్వం  భూ సేకరణకు చొరవ తీసుకోలేదు. అయితే భూములిస్తారనే నమ్మకంతో మామునూర్, వరంగల్‍ సిటీలో ఏఏఐ మట్టి నమూనాలు సేకరించింది. విమానాలు ఎగరడానికి వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు 2020లో కేంద్రానికి ఏఏఐ రిపోర్ట్  ఇచ్చింది. అయినా ఎయిర్‍పోర్టు పున:ప్రారంభానికి నాటి బీఆర్ఎస్  ప్రభుత్వం భూములు ఇవ్వలేదు. దీంతో ఎయిర్‍పోర్టు అధికారులు రాష్ట్రానికి మరో ప్రతిపాదన చేశారు. 500 ఎకరాలకు బదులు కనీసం 253 ఎకరాలు ఇచ్చినా ఏ320 తరహాలో సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు.

భూములున్నా.. ఫైల్‍ ఆపిన కేసీఆర్‍

ఏఏఐ 253 ఎకరాల భూములు అడిగిన ప్రతిసారి.. నాటి ప్రభుత్వం జిల్లా అధికారులను మామునూర్‍  పంపి సర్వేల పేరుతో హడావుడి చేసింది. నిరుడు కూడా అలాగే చేసింది. దీంతో జిల్లా ఆఫీసర్లు రంగంలోకి దిగి గూగుల్‍  సర్వే ఆధారంగా ప్రస్తుత ఎయిర్‍పోర్టు చుట్టూ ఉండే నక్కలపల్లి, గాడిపల్లి, బొల్లికుంట గ్రామాల పరిధిలో రైతులకు చెందిన 249.33 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని సేకరించే క్రమంలో రైతులకు పరిహారంగా భూమికి భూమి ఇవ్వాల్సి ఉంటుందని ప్రతిపాదనలు చేశారు. ఇదే మామునూర్‍లో పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి  చెందిన దాదాపు 605పైగా ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. అందులోని 373.02 ఎకరాల భూములను ఖిలా వరంగల్  తహసీల్దార్  ఆఫీసుకు బదలాయిస్తే ఎయిర్‍పోర్టు అభివృద్ధికి రూట్‍  క్లియర్‍ అవుతుందని వరంగల్  కలెక్టర్‍  ప్రావీణ్య జిల్లాకు చెందిన అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావును కలిసి వివరించారు. నిరుడు మే నెలలో ప్రభుత్వానికి రిపోర్ట్  ఇచ్చారు. కానీ, ఈ రిపోర్టును నాటి ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. దీంతో వరంగల్  జిల్లా వాసులకు మామునూర్‍  ఎయిర్‍పోర్టు అందని ద్రాక్షగా మిగిలిపోయింది.

త్వరలో భూ పరిశీలన

మామునూర్‍  ఎయిర్‍పోర్టును పున:ప్రారంభించేందుకు త్వరలోనే ఇక్కడి భూములను పరిశీలిస్తాం. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా డెవలప్‍మెంట్‍  రివ్యూ మీటింగ్‍లో జిల్లా ఇన్ చార్జ్  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి దృష్టికి తీసుకెళ్లా. భూముల పరిశీలనకు రావాల్సిందిగా ఆయనను కోరా. త్వరలోనే ఈ అంశం ఓ కొలిక్కి వస్తుంది.

- దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ

మొన్నటి మంత్రుల రివ్యూలో విమానాశ్రయ టాపిక్‍

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‍  ప్రభుత్వం మామునూర్‍  విమానాశ్రయంపై  ఓ అవగాహనకు వచ్చింది. ఈనెల 20న మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్  ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్‍లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్‍  జిల్లా అభివృద్ధి రివ్యూలో ఈ విషయంపై చర్చించారు. ఏండ్ల తరబడి పెండింగ్‍లో ఉన్న ఓరుగల్లు కలల ప్రాజెక్టును నెరవేర్చేందుకు మంత్రులు కసరత్తు చేస్తున్నారు.