- స్కూల్ ఏర్పాటు చేయాలని ఇటీవల రక్షణ శాఖ మంత్రిని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి
- హనుమకొండ జిల్లా ఎలుకుర్తి వద్ద ఏర్పాటుకు గతంలోనే ప్రపోజల్స్
- అప్పట్లోనే 50 ఎకరాల భూమిని పరిశీలించిన ఆఫీసర్లు
- ఆ తర్వాత పట్టించుకోని బీఆర్‌ఎస్ సర్కార్
- తాజాగా సీఎం విజ్ఞప్తితో స్కూల్ ఏర్పాటుపై చిగురిస్తున్న ఆశలు
హనుమకొండ/ ధర్మసాగర్ వెలుగు : గతంలో మంజూరై, భూమిని పరిశీలించిన తర్వాత ఆగిపోయిన సైనిక్ స్కూల్ ఏర్పాటుకు మళ్లీ అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఏడేళ్ల క్రితమే స్కూల్ మంజూరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో అది కాస్తా కాగితాల దశలోనే ఆగిపోయింది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్కూల్ ఏర్పాటు గురించి ప్రస్తావించడంతో త్వరలోనే స్కూల్ ఏర్పాటుకానున్నట్లు తెలుస్తోంది.
2016లోనే మంజూరు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016లోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సైనిక్ స్కూల్ మంజూరు చేసింది. భూసేకరణ, బిల్డింగ్ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం రూ.100 కోట్ల వరకు ఖర్చు అవుతాయని అంచనా వేసింది. స్కూల్ నిర్మాణానికి 50 ఎకరాల అవసరం అవుతాయని, ఆ మేరకు స్థలాన్ని సేకరించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
దీంతో హనుమకొండ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ మండలం ఎలుకుర్తిలో అసైన్డ్ భూములను పరిశీలించారు. ఎలుకుర్తి గ్రామ శివారులోని సర్వే నంబర్ 160లో మొత్తం 229 ఎకరాల భూమి ఉండగా ఇందులో సైనిక్ స్కూల్ కోసం 50 ఎకరాలు, ఆ పక్కనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ కోసం మరో 52 ఎకరాలను సేకరించేందుకు కసరత్తు చేశారు.
ఈ మేరకు భూసేకరణ కోసం రైతులు, వారి బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరించారు. ఇందులో హెచ్‌పీఎస్‌కు ఇచ్చే 52 ఎకరాలకు సంబంధించి 56 మంది రైతులకు ఎకరానికి రూ.8.60 లక్షల చొప్పున పరిహారం కూడా చెల్లించారు. కానీ సైనిక్ స్కూల్ అంశం మాత్రం కాగితాల దశలోనే ఆగిపోయింది.
చిగురిస్తున్న ఆశలు
సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 5న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిశారు. పలు పనులకు రక్షణ శాఖ భూములు కేటాయించడంతో పాటు, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఎలుకుర్తి వద్ద ఏర్పాటు చేస్తారనుకున్న సైనిక్ స్కూల్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడం వల్లే స్కూల్ ఏర్పాటు ముందుకు సాగడం లేదన్న వాదనలు ఉండగా.. ఇప్పుడు స్కూల్ ఏర్పాటు చేయాలని సీఎం స్వయంగా కోరడంతో త్వరలోనే భూ కేటాయింపు పూర్తవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్కూల్ ఏర్పాటైతే వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు స్టూడెంట్లకు మెరుగైన విద్య అందే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
స్పందించని బీఆర్ఎస్ సర్కార్
వరంగల్ జిల్లాకు కేంద్రం సైనిక్ స్కూల్‌ను మంజూరు చేసిన విషయాన్ని 2017 జనవరి 17న అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటించారు. త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకోబోతున్నామని చెప్పారు. అదే ఏడాది మార్చిలో ఎంవోయూపై సంతకాలు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న బీఆర్‌ఎస్ నేతలు ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ వచ్చారు.
కేంద్రం సిద్ధంగానే ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడం వల్లే స్కూల్ ఆగిందని కిషన్‌రెడ్డి పలుమార్లు విమర్శించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్లు రాస్తున్నా స్పందించడం లేదన్నారు.
ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్గొండ ఎంపీగా ఉన్న టైంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశంపై పార్లమెంట్ ప్రశ్నించగా.. అప్పటి రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీపాదనాయక్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ బీఆర్‌ఎస్ లీడర్లు మాత్రం కేంద్ర ప్రభుత్వమే పట్టించుకోవడం లేదంటూ దాటవేస్తూ వచ్చారు.