మెగా డీఎస్సీపై చిగురిస్తున్న ఆశలు .. టీచర్​ పోస్టుల కోసం ఏండ్లుగా ఎదురుచూపులు

  • గడిచిన పదేండ్లలో ఒకేసారి రిక్రూట్​మెంట్​
  • ఉమ్మడి జిల్లాలో వేలాదిగా బీఈడీ, డీఈడీ కంప్లీట్​ చేసిన యువత


నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు: మెగా డీఎస్సీపై జిల్లా నిరుద్యోగ యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. డిసెంబర్ 30న సీఎం రేవంత్​రెడ్డి విద్యాశాఖపై రివ్యూ నిర్వహించిన సందర్భంలో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. దీంతో టీచర్​అభ్యర్థుల్లో ఉత్సాహం షురైంది. డీఎస్సీ నిర్వహిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న వందలాది టీచర్​ పోస్టులు భర్తీ అవుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మెరుగుపడే అవకాశం ఉంది.

నిజామాబాద్​లో పరిస్థితి ఇలా..

జిల్లాలో 789 ప్రైమరీ, 138 అప్పర్​ ప్రైమరీ, 269 హైస్కూళ్లు, 10 ఆదర్శ, 25 కస్తూర్బా స్కూళ్లు ఉన్నాయి. లోకల్​బాడీ పరిధిలోని ప్రైమరీ, యూపీఎస్, హైస్కూళ్ల 5,919 శాంక్షన్​ టీచర్ ​పోస్టులుండగా 4,951 మంది పనిచేస్తున్నారు. 969 ఖాళీలు ఉన్నాయి. స్టూడెంట్స్ లేని కారణంగా గడిచిన ఆరేండ్లలో జిల్లాలో 92 ప్రైమరీ, 24 అప్పర్ ​ప్రైమరీ స్కూళ్లు మూతపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న టీచర్లను దగ్గర్లోని ఇతర స్కూళ్లకు అడ్జెస్ట్​ చేశారు. సర్దుబాట్లు పోను 2023, జులై నాటికి జిల్లాలో 569 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ 2023, సెప్టెంబరులో వేసిన నోటిఫికేషన్​లో 211 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు.

కామారెడ్డి జిల్లాలో.. 

జిల్లాలో 1,011 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో లోకల్​ బాడీఎస్ పరిధిలో 988, గవర్నమెంట్ పరిధిలో 23 ఉన్నాయి. మొత్తం టీచర్ పోస్టులు 4,938  కాగా, ప్రస్తుతం 4,082 మంది పని చేస్తున్నారు. వివిధ విభాగాల్లో 856 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 గత ప్రభుత్వం రేషనలైజేషన్ 

ప్రక్రియ చేపట్టింది. స్టూడెంట్స్ తక్కువగా ఉన్న చోట, జీరో ఎన్​రోల్​మెంట్​ ఉన్న స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను తగ్గించారు. గత ప్రభుత్వం 2023, సెప్టెంబర్​లో ఇచ్చిన నోటిఫికేషన్​లో జిల్లాలో 200 పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతిచ్చింది. ఖాళీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భర్తీలో మాత్రం తక్కువగా చూపారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. 

వేలాదిగా ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లాలో బీఈడీ కంప్లీట్​ చేసినోళ్లు15 వేలు, డీఈడీ చేసిన వారు 6 వేలకు పైగా ఉన్నారు. తెలంగాణ వర్సిటీతో పాటు జిల్లాలో ఎనిమిది బీఈడీ, డీఈడీ కాలేజీలున్నాయి. ఏటా 600 మంది టీచర్​ కోర్సు పూర్తి చేస్తున్నట్లు అంచనా. వీరంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్​గవర్నమెంట్​2023, సెప్టెంబరులో టీచర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ వేసింది. 

స్టేట్​లో 13,086 ఉన్నట్లు లెక్కలు చెప్పి 5,089 పోస్టులు భర్తీకి మాత్రమే ప్రకటన ఇచ్చింది. నవంబర్ 20 నుంచి 30 వరకు ఎగ్జామ్స్​డేట్స్​ ప్రకటించడంతో నిరుద్యోగులు ప్రిపేర్​అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్​తో ఎగ్జామ్స్​వాయిదా పడ్డాయి. ఎంతో కాలం నుంచి ఎదురుచూసిన టీచర్​ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడడంతో  నిరాశకు లోనయ్యారు. సీఎం రేవంత్​రెడ్డి రెండు రోజుల కింద చేసిన ప్రకటనతో మళ్లీ వారిలో ఆశలు పెరిగాయి. 2023, సెప్టెంబర్​లో గుర్తించిన ఖాళీలకు తోడు ఇప్పుడు మరిన్ని పెరిగే అవకాశముందని నిరుద్యోగులు భావిస్తున్నారు.

 పదేండ్లుగా ఎదురు చూస్తున్నా

నేను 2012 లో బీఈడీ, 2016లో డీఈడీ పూర్తి చేశా. పదేండ్లుగా టీచర్​ జాబ్​కోసం ఎదరు చూస్తున్నా. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం పదేండ్లలో 2018లో ఒకేసారి మాత్రమే టీచర్​ పోస్టులను భర్తీ చేసింది. ఎన్ని ఖాళీలు ఏర్పడినా భర్తీకి నోచుకోలేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే మెగా డీఎస్సీ ప్రకటన చేయడం శుభపరిణామం. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి.  ​

ఆముదాల నరేశ్, శాంతాపూర్, బిచ్కుంద​