- పత్తిపాక రిజర్వాయర్ హామీపై మంత్రి ఉత్తమ్‌ను కలిసిన రైతులు
- సానుకూల స్పందనతో హర్షం.. గుంటిమడుగు రిజర్వాయర్, పోతారం లిఫ్ట్ పనులు చేయాలని విన్నపం
- 2004 నుంచే గుంటిమడుగు ప్రతిపాదనలు
- ఆశ చూపి వదిలేసిన కేసీఆర్ సర్కార్
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గాలను కలుపుకొని పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు మంత్రి ఉత్తమ్ సానుకూలంగా ఉన్నారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పత్తిపాక నిర్మాణం కోసం ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
మంత్రి సానుకూలంగా స్పందించినట్టురైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏండ్లుగా ఎదురు చూస్తున్న గుంటిమడుగు రిజర్వాయర్, పోతారం లిఫ్ట్ పనులపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం పనులు చేస్తామని చెప్పినా పూర్తి చేయలేదు. దీంతో స్థానికరైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.
2004 నుంచి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గుంటిమడుగు వద్ద రిజర్వాయర్ నిర్మించడానికి ప్రపోజల్స్ పూర్తి చేశారు. 2016లో బీఆర్ఎస్ సర్కార్ గుంటిమడుగును రిజర్వాయర్ పనులు మొదలు పెడతామని రైతులను ఊరించింది. కానీ, పనులు మాత్రం జరగలేదు. అప్పటి కలెక్టర్ అలగు వర్షిణి రిజర్వాయర్ నిర్మించే ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అయినా పనులు జరుగకపోవడంతో రైతులు నిరాశ చెందారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్ట్‌లపై హామీలు ఇవ్వడంతో రైతులు మళ్లీ ఈ పనులపై ఆశలు పెట్టుకున్నారు.
గుంటిమడుగు రిజర్వాయర్ ద్వారా పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లోని చాలా గ్రామాలకు సాగునీరు అందుతుంది. అలాగే మంథని మండలంలోని గోదావరి పై పోతారం లిఫ్టు కోసం గతంలో రైతులు ఆందోళనలు చేశారు. అలాగే సంబంధిత అధికారులకు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి జిల్లా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నాలు ప్రారంభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గుంటిమడుగు రిజర్వాయర్, పోతారం లిఫ్టు పనులపై కూడా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
గుంటిమడుగుతో టేల్ఎండ్కు మేలు...
గుండిమడుగు బ్యారేజ్ నిర్మాణం వల్ల ఎస్సారెస్పీ టేల్ ఎండ్ రైతులకు మేలు జరుగుతుంది. 5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజ్ నిర్మించాలనుకున్నారు. దీని వల్ల 50 నుంచి 60 వేల ఎకరాల కు నీరందించవచ్చు. వల్ల గోదావరిలోకి పోతున్న నీటిని ఉపయోగంలోకి తెచ్చే అవకాశం ఉంది. ముంపు లేకుండా రెండు గుట్టల నడుమ 400 మీటర్ల వరకు బ్యారేజ్ నిర్మిస్తే మానేరులో దాదాపు 9 కిలో మీటర్ల పొడవునా , హుస్సేన్‌మియా వాగులో మరో 9 కిలో మీటర్ల పొడవునా నీరు నిల్వ చేయవచ్చని ప్రతిపాదించారు.
గుంటిమడుగు బ్యారేజ్ ద్వారా కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, మంథని, ముత్తారం మండలాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, హుజురాబాద్లతో పాటు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చాలా గ్రామాలకు సాగునీరందుతుంది. ఏటా మానేరు నుంచి 150టీ ఎంసీల నీరు గోదావరి ద్వారా సముద్రంలో కలుస్తోంది. ఎల్ఎండీ, మిడ్‌మానేరు, ఎస్సారెస్సీ, హుస్సేన్‌మియా, నక్కలవాగు, చలివాగు, శ్రీరామసరోవర్ గుట్టల నుంచి పారే నీరంతా మానేరులో కలిసి వృధాగా పోతుంది.
పెద్దపల్లి జిల్లాలోని సాగు భూములకు ఎస్సారెస్పీ డి83, డి86 కాలువల ద్వారా నీరందుతోంది. ఈ కాలువల కింద ఆయకట్టు 62 వేల ఎకరాలుంది. ఎప్పడూ పూర్తిస్థాయిలో ఆయకట్టు భూములకు నీరందలేదు. పక్కనే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నా ఇప్పటికీ ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతూనే ఉన్నారు. గుంటిమడుగు రిజర్వాయర్ నిర్మాణ జరిగితే రైతుల సాగు సమస్యకు పరిష్కారం లభిస్తుందని రైతులు ఎదురు చేస్తున్నారు.
లిఫ్ట్‌లతోనే సాగుకు పరిష్కారం...
దశాబ్దాల నుంచి గోదావరిపైన ఆరెంద, పోతారం, ఉప్పట్ల వద్ద లిఫ్ట్‌లు పెట్టాలనే డిమాండ్ ఉంది. బీఆర్ఎస్ సర్కార్ గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం మంథని తలాపున ఉన్నా, మంథని నియోజకవర్గంలోని పలుమండలాలకు సాగునీరందటం లేదు. పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో మంథని రైతులు నిర్లక్ష్యానికి గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా గ్రామాలకు సాగునీరు అందాలంటే ఎత్తిపోతల పథకం ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పోతారం వద్ద ఎత్తిపోతల పథకం చేపట్టాలని గతంలో చాలా సార్లు రైతులు ఆందోళన చేశారు. మండలంలో గోదావరి నది ప్రవహిస్తున్నా, కాళేశ్వరం నీళ్లు నిండుకుండలాఉన్నా కూడా గోదావరి పరివాహక గ్రామాల్లో పొలాలు ఎండిన పరిస్థితులు ఉన్నాయి. నీళ్లు వస్తాయని నమ్మకంతో ఏటా పంటలు వేసిన రైతులు చివరికి నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పడు కాంగ్రెస్ప్రభుత్వం దృష్టి సారించి పోతారం లిఫ్ట్ పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.