ఎస్టీపీపీ విస్తరణపై ఆశలు.. 800 మెగావాట్ల మూడో యూనిట్​కు త్వరలోనే టెండర్లు

ఎస్టీపీపీ విస్తరణపై ఆశలు..  800 మెగావాట్ల మూడో యూనిట్​కు త్వరలోనే టెండర్లు
  • సెంట్రల్ కోల్ మైన్స్ సెక్రటరీ అమృత్ లాల్ మీనా సూచన 
  •  ప్రస్తుతం1,200 మెగావాట్లతో పీఎల్ఎఫ్​సాధనలో రికార్డులు
  • 800 మెగావాట్ల మూడో యూనిట్​కు త్వరలోనే టెండర్లు 
  • ప్లాంట్​ ఏర్పాటుకు అందుబాటులో వనరులు 
  •  విస్తరణతో వేల మందికి ఉద్యోగాలు లభించే చాన్స్
  •  చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​లోని సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) విస్తరణపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 1,200 మెగావాట్ల కరెంట్​ఉత్పత్తి అవుతుండగా, మరో రెండు 800 మెగావాట్ల యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సెంట్రల్​కోల్ మైన్స్​సెక్రటరీ అమృత్​లాల్ మిశ్రా సూచించారు. శనివారం ఆయన సింగరేణి సీఎండీ బలరాం నాయక్​తో కలిసి ఎస్టీపీపీని సందర్శించారు. సింగరేణి బొగ్గు, గోదావరి నీళ్లు, భూములతోపాటు అవసరమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున ప్లాంట్​ విస్తరణ చేపట్టాలన్నారు. సింగరేణిలో 40వేలకు పైగా ఉద్యోగులు ఉన్నందున కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు వాటిని సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని సూచించారు. సింగరేణి కోల్​బ్లాకుల విషయమై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీపీపీ విస్తరణకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అమృత్​లాల్​మిశ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

త్వరలోనే థర్డ్​యూనిట్ పనులు

ఎస్టీపీపీలో ప్రస్తుతం రెండు 600 మెగావాట్ల యూనిట్ల ద్వారా 1,200 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి అవుతోంది. వంద శాతం ప్లాంట్​లోడ్​ఫ్యాక్టర్​ (పీఎల్ఎఫ్) సాధిస్తూ దేశంలోనే రికార్డులు సృష్టిస్తోంది. అంతేగాకుండా రాష్ట్ర విద్యుత్​అవసరాల్లో 12 శాతం ఈ ప్లాంట్ తీరుస్తోంది. గత ఐదేండ్లలో ఏకంగా 60,521 మిలియన్​ యూనిట్ల కరెంట్​ను ఉత్పత్తి చేసి స్టేట్ గ్రిడ్​కు సప్లై చేసింది. అన్ని వనరులు అందుబాటులో ఉండడంతో సింగరేణి మేనేజ్​మెంట్​800 మెగావాట్ల సూపర్ క్రిటికల్​ థర్మల్ ప్లాంట్​నిర్మాణాన్ని తలపెట్టింది. రూ.6,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్లాంట్​ను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అంచనా వ్యయం కంటే ఎక్కువగా కోట్​చేయడంతో టెండర్లను రద్దు చేశారు. మళ్లీ టెండర్లు నిర్వహించి త్వరలోనే థర్డ్​యూనిట్​పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు మరో 800 మెగావాట్ల ప్లాంట్​ను నిర్మిస్తే ఎస్టీపీపీలో 2,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. రాష్ట్ర అవసరాల్లో 25 శాతానికి పైగా ఈ ప్లాంట్​తీర్చనుంది. 

కాకా ఫ్యామిలీ చొరవతోనే..

2005లో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఎస్టీపీపీ నిర్మాణం మొదలుపెట్టారు. అప్పటి పెద్దపల్లి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, ఆయన తనయుడు అప్పటి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వినోద్ ఎస్టీపీపీ ఏర్పాటుకు తమవంతు కృషి చేశారు. అనంతరం 2009 నుంచి 2014 వరకు పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కాకా కుమారుడు, ప్రస్తుత చెన్నూర్​ ఎమ్మెల్యే డాక్టర్​జి.వివేక్​ వెంకటస్వామి ఎస్టీపీపీకి చొరవ చూపారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2016లో అప్పటి సీఎం కేసీఆర్ ఎస్టీపీపీని ప్రారంభించారు. 

ALSO READ : ఖాళీ అవుతున్న కారు..కామారెడ్డిలో బీఆర్ఎస్​ను వీడుతున్న పార్టీ లీడర్లు

80 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

ఎస్టీపీపీ ఏర్పాటు కోసం జైపూర్ మండలంలోని పెగడపల్లి, గంగిపల్లి, ఎల్కంటి గ్రామాల పరిధిలో 1,883 ఎకరాల వ్యవసాయ భూములను సేకరించారు. 825 భూనిర్వాసిత కుటుంబాల్లో ఇంటికో పర్మినెంట్​జాబ్, కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకే ఇస్తామని అప్పట్లో సింగరేణి అధికారులు హామీ ఇచ్చి, తర్వాత మోసం చేశారు. దీంతో చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్​ జి.వివేక్​వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని విషయాన్ని సీఎం రేవంత్​రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం, సింగరేణి యాజమాన్యం ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్టులతోపాటు ఎస్టీపీపీలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా ఇటీవల ఆర్డర్స్​జారీ చేసింది. భవిష్యత్తులో రెండు 800 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం జరిగితే దాదాపు 2 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.