ఆశలన్నీ సెలీన్పైనే.. చంద్రయాన్3కి మరోపేరు
జపాన్ జాక్సాతో కలిసి 2025లో ప్రయోగం
ల్యాండర్, రోవర్లలో చీకట్లను తట్టుకునే ఆర్హెచ్యూ టెక్నాలజీ
విక్రమ్‌పై నల్లటి నీడలు కమ్మేసే టైం వచ్చేసింది. చందమామను చీకటి ఆవహించేసింది. గురువారంతో సూర్యుడు వెళ్లిపోయాడు. టెంపరేచర్లు జీరోను దాటి మైనస్‌లోకి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే చంద్రయాన్ 2 ల్యాండర్‌ను లైన్లోకి తెచ్చేందుకు ఇస్రో శతవిధాలా ప్రయత్నించింది. అయినా అవేవీ ఫలించలేదు. ఇప్పుడు ప్రయత్నించినా ఫలిస్తుందన్న ఆశా లేదు. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టు జరిగి విక్రమ్ కరెక్ట్‌గా ల్యాండ్ అయినా ఇప్పటితో అది పనిచేసే టైం అయిపోయేదే. కారణమేందో తెలిసిందే. 14 రోజులకే విక్రమ్‌ను, రోవర్ ప్రజ్ఞాన్‌ను డిజైన్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గా జరిగిన అపోలో మిషన్లూ చందమామ చీకటిని తట్టుకుని నిలబడ లేకపోయాయి. చైనా పంపిన చాంగీ మిషన్‌ది మాత్రం కొంచెం గట్టిగా నిలబడింది. దానికి కారణం అందులో వాడిన రేడియో యాక్టివ్ హీటర్ యూనిట్లే. వాటి వల్లే చంద్రుడిపై చీకటి వచ్చినా అది ఇన్ని రోజులు ఉండగలుగుతోంది. దానికన్నా ముందు 1970లో సోవియట్ పంపిన లూనోఖోడ్స్ చందమామపై చీకటిని తట్టుకుని నిలబడింది.
విక్రమ్ పరిస్థితేంటి?
విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కాకపోయినా చంద్రయాన్2 ప్రయోగం 100 శాతం సక్సెసేనని ఇస్రో చైర్మన్ కే శివన్ చాలా సందర్భాల్లో చెప్పారు. దానికి కారణం ఆర్బిటర్. అవును, అసలైన ప్రయోగాలు అదే చేస్తుందని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలోనూ శివన్ చెప్పారు. ఏడున్నరేళ్లపాటు సేవలందిస్తుందన్నారు. దాన్ని పక్కనపెడితే, చంద్రుడిపై చీకటి వచ్చేసిన నేపథ్యంలో విక్రమ్‌పై ఆశలు వదిలేసుకోవాల్సిందే. మరి, ఇస్రో, కోట్లాది మంది ఇండియన్ల ఆశలు దేనిపై పెట్టుకోవాలి? అదే సెలీన్– ఆర్! అవును, చంద్రయాన్3కి మరోపేరే సెలీన్– ఆర్. జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా సహకారంతో ఇస్రో ఈ ప్రయోగం చేయబోతోంది. 2025లో చంద్రుడి ధ్రువాల వద్దకు పంపి, శాంపిళ్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ ప్రయోగానికి సంబంధించి 2008లోనే ప్రకటన వచ్చినా, దానికి సంబంధించిన చర్చలు ఈమధ్యే జరిగాయి. ఈ ప్రయోగంలో ల్యాండర్, రోవర్లు చందమామ చీకట్లలోనూ పనిచేసేలా చైనా వాడినట్టే ఆర్హెచ్యూలను వాడనున్నారు.
సమస్యలు.. పరిష్కారాలు
నిజానికి ఆర్హెచ్యూలను ల్యాండర్, రోవర్లలో వాడడం అంత తేలికేం కాదు. ఇప్పటిదాకా వాటిని వాడిన అనుభవమూ లేదు. ఆర్హెచ్యూలకు కరెంట్ వనరు న్యూక్లియర్ పవరే. వాటి నుంచి వచ్చే అణుధార్మికత, స్పేస్‌క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్‌లపై ప్రభావం చూపే ప్రమాదముంటుంది. దానికి పరిష్కారాలు లేవా అంటే, ఉన్నాయనే అంటున్నారు కొందరు. గత ఏడాది ‘సర్వైవ్ అండ్ ఆపరేట్ త్రూ ద లూనార్ నైట్’పై వర్క్‌షాప్ నిర్వహించారు. అందులో ఇస్రో సహా పలు స్పేస్ ఏజెన్సీలు పాల్గొన్నాయి. అందులో కొన్ని పరిష్కారాలు చూపించాయి. ఇస్రో కూడా ఓ ప్రత్యామ్నాయ పద్ధతిని అందులో డెమాన్స్ట్రేట్ చేసింది. సిములేషన్ సెటప్ వేసి ‘లిథియం అయాన్ బ్యాటరీ’లతో ల్యాండర్, రోవర్లను పనిచేయించే పద్ధతిని చూపించింది. అది కాకుండా చందమామ నేలలో ఉండే వేడిని వాడుకునే థర్మల్ వాడీలనూ సైంటిస్టులు ప్రతిపాదించారు. అయితే, అది కేవలం తేలికపాటి రోవర్లకు మాత్రమే సరిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. పెద్ద వాటికి పనిచేయదంటున్నారు.
ఆర్బిటర్ మంచిగుంది
విక్రమ్‌పై ఆశలు సన్నగిల్లిపోతున్న టైంలో చంద్రయాన్2పై ఇస్రో తాజా ప్రకటన చేసింది. ప్రస్తుతం కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్ బాగా పనిచేస్తోందని తెలిపింది. అందులోని అన్ని పేలోడ్లు ఆరోగ్యంగా ఉన్నాయని, పేలోడ్ల ట్రయల్స్ సక్సెస్ అయ్యాయని చెప్పింది. చేయాల్సిన అన్ని సైన్స్ ఎక్స్పరిమెంట్లను ఆర్బిటర్ చేస్తుందని వెల్లడించింది. ల్యాండర్ విక్రమ్‌తో కమ్యూనికేషన్ కట్ అవడానికి గల కారణాలను ఇస్రో నిపుణులు, విద్యావేత్తలు కలిగిన జాతీయ స్థాయి కమిటీ విశ్లేషిస్తోందని చెప్పింది.
విక్రమ్ ఫొటోలు తీసిన నాసా ఆర్బిటర్
నాసా ఆర్బిటర్ లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్వో) విక్రమ్ ఫొటోలు తీసిందని, వాటిని నాసా పరిశీలిస్తోందని ఎల్ఆర్వో డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లర్ చెప్పారు. నాసా ప్రకటనను ఆయన ధ్రువీకరించారు. ‘‘ఎల్ఆర్వోసీ టీం విక్రమ్ ల్యాండింగ్ సైట్ ఫొటోలను పరిశీలిస్తుంది. అంతకుముందు వాటితో పోల్చి విక్రమ్ కనిపిస్తోందో లేదో తేలుస్తుంది. విక్రమ్ నీడలనూ పసిగడుతుంది” అని చెప్పారు. ఆర్బిటర్ అక్కడి నుంచి వెళ్లినప్పుడు అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయని చెప్పారు. దాని వల్ల చాలా ప్రాంతం చీకట్లో ఉందన్నారు. త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేసే అవకాశముందని చెబుతున్నారు.