- 20 ఏండ్లుగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి జిల్లా రైతులు
- పెండింగ్ ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం
- గుంటిమడుగు రిజర్వాయర్, పోతారం లిఫ్ట్‌లను పూర్తిచేయాలని విన్నపాలు
- 2004 నుంచే గుంటిమడుగు రిజర్వాయర్ ప్రతిపాదనలు
- హామీ ఇచ్చి పూర్తిచేయని బీఆర్ఎస్ సర్కార్
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని గుంటిమడుగు రిజర్వాయర్, పోతారం లిఫ్ట్ ప్రాజెక్ట్‌ల నిర్మాణంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తిచేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయగా.. మంథని, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని ఈ ప్రాజెక్ట్‌లను పూర్తిచేయడంపై రైతులు ఎదురుచూస్తున్నారు. పోతారం లిప్టు, గుంటిమడుగు రిజర్వాయర్నిర్మాణ పనులు 20 ఏండ్ల కింద ప్రారంభం కాగా ఇప్పటికీ పూర్తికాలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ ఈ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయింది.
పెండింగ్ ప్రాజెక్టులపై సర్కార్ నజర్
పెద్దపల్లి జిల్లాలో ఉన్న పెండింగ్ప్రాజెక్టులపై సర్కార్ సానుకూలంగా ఉందనే సంకేతాలు వస్తుండటంతో జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2004లో కాల్వ శ్రీరాంపూర్ మండలం గుంటిమడుగు వద్ద 5టీఎంసీల సామర్థ్యంతో ముంపు లేకుండా రెండు గుట్టల మధ్య 400 మీటర్ల వెడల్పుతో రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించారు. మానేరులో 9 కిలోమీటర్లు, హుస్సేన్‌మియా వాగులో మరో 9 కిలోమీటర్లు బ్యాక్ వాటర్ నిలుస్తుందని అంచనావేశారు.
ఈ రిజర్వాయర్ కింద 50 నుంచి 60 వేల ఎకరాల పంటలకు నీరందతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. 2016లో బీఆర్ఎస్ సర్కార్ గుంటిమడుగును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా నాటి కలెక్టర్వర్షిణి కూడా రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాన్ని కూడా పరిశీంచారు. ఆ తర్వాత ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ రిజర్వాయర్ ద్వారా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, మంథని, ముత్తారం, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలాల్లోని గ్రామాలకు సాగునీరందుతుంది.
లిఫ్ట్‌లు పూర్తి చేయాలని రైతుల డిమాండ్
దశాబ్దాల నుంచి గోదావరిపై ఆరెంద, పోతారం, ఉప్పట్ల వద్ద లిఫ్ట్‌లు నిర్మించాలని రైతుల నుంచి డిమాండ్ ఉంది. మంథని మండలం పోతారం వద్ద లిఫ్ట్ కోసం రైతులు ఆందోళనలు చేసి అధికారులకు వినతిపత్రాలు కూడా ఇచ్చారు.
గత సర్కార్ గొప్పగా నిర్మించామని చెప్పిన కాళేశ్వరం తలాపునే ఉన్నా.. మంథని నియోజకవర్గంలోని చాలాగ్రామాలకు సాగునీరు అందించలేకపోయింది. గతంలో గుండారం రిజర్వాయర్ నుంచి వచ్చే ఎల్ సిక్స్ కెనాల్ కాలువ ద్వారా వేల ఎకరాల పంట పొలాలకు నీళ్లు వచ్చేవి. సింగరేణి ఓసీపీల విస్తరణతో రామగిరి మండలంలో ఎల్ సిక్స్ కెనాల్ పూర్తిగా ధ్వంసమైంది.
అనంతరం కొత్తగా మరో ఎల్ సిక్స్ కెనాల్ నిర్మించినా కూడా రిపేర్లకు గురైంది. దీంతో మంథని మండలంలోని వేల ఎకరాల పంట పొలాలకు నీరు అందడంలేదు. ఈక్రమంలో లిఫ్టుల నిర్మాణం ద్వారానే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.