అమ్మానాన్నలను పెళ్లిరోజే చంపిన కొడుకు

అమ్మానాన్నలను పెళ్లిరోజే చంపిన కొడుకు
  • అమ్మానాన్నల పెళ్లిరోజే వారిని చంపేసిన కొడుకు
  • నిద్రిస్తున్న వారిపై కత్తితో దాడి చేసి హత్య
  • పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో బయటపడ్డ దారుణం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని నెబ్​ సరాయ్​లో బుధవారం ఘోరం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో తల్లీదండ్రులతో పాటు కూతురు దారుణ హత్యకు గురయ్యారు. కొడుకు మాత్రమే ప్రాణాలతో మిగిలాడు. మార్నింగ్​ వాక్ కు వెళ్లి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిందని, తన తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా చనిపోయిందని కన్నీటిపర్యంతమయ్యాడు. 

అయితే, ఈ ఏడుపు కొంత అసహజంగా అనిపించడంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తండ్రి అవమానించాడని, ఆస్తి మొత్తం అక్కకే రాసిచ్చే ప్రయత్నం చేస్తున్నారనే కోపంతో తల్లి, తండ్రి, అక్కలను తానే చంపేశానని వెల్లడించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

తండ్రి తిట్టిండని కోపం పెంచుకున్న కొడుకు..

నెబ్​ సరాయ్​ కి చెందిన రాజేశ్​ కుమార్​ (51) తన భార్య కోమల్​(46), కూతురు కవిత (23), కొడుకు అర్జున్ లతో నివాసం ఉంటున్నారు. ఈ నెల 4న రాజేశ్, కోమల్​ ల పెళ్లి రోజు. అయితే, బుధవారం తెల్లవారుజామున రాజేశ్, కోమల్, కవితలు ఇంట్లో కత్తిపోట్లతో రక్తపుమడుగులో పడి ఉన్నారు. మార్నింగ్​ వాక్ కు వెళ్లిన అర్జున్ తిరిగి వచ్చేసరికి మొదటి అంతస్తులో రాజేశ్​డెడ్​బాడీ, కోమల్, కవిత మృతదేహాలు గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో కనిపించాయి. దీంతో అర్జున్ వెంటనే ఇరుగుపొరుగు వారిని అప్రమత్తంచేసి పోలీసులకు సమాచారం అందించాడు.

 అర్జున్ మాటల్లో తడబాటును గమనించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఈ మర్డర్లు తానే చేసినట్లు అర్జున్ ఒప్పుకున్నాడు. చదువు విషయంలో తిడుతుండడంతో తండ్రిపై ద్వేషం పెరిగిందని చెప్పాడు. తండ్రి తనను తిడుతున్నా అమ్మ కానీ, అక్క కానీ తనకు మద్దతుగా నిలవకపోవడంతో తాను ఒంటరి వాడినని ఫీలయ్యానని చెప్పాడు. ప్లాన్ ప్రకారం నిద్రలో ఉన్న తల్లీదండ్రులతో పాటు సోదరిని పొడిచి చంపినట్లు పేర్కొన్నాడు.