- 43 ఎకరాల్లో ఏర్పాటు
- సాంకేతిక పద్ధతుల్లో మొక్కల ఉత్పత్తి
- 2 వేల ఎకరాలకు సరిపడ మొక్కలు
మెదక్, నిజాంపేట, వెలుగు: మెదక్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడానికి, రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించేందుకు హార్టికల్చర్ఆఫీసర్లు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ క్రమంలో రైతులకు నాణ్యమైన పామాయిల్ మొక్కలను అందించేందుకు పామాయిల్ నర్సరీలను ఏర్పాటు చేసి సబ్సిడీపై పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు చేశారు.
గతంలో ఆయిల్ పామ్ తోటను సాగు చేయాలంటే రైతులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి ఖమ్మం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మొక్కలను తీసుకొని వచ్చి తోటను సాగు చేసేవారు. దీంతో రైతులకు తోట పెంపకానికి అయ్యే ఖర్చుతో పాటు రవాణా ఖర్చులు మీదపడేవి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అయిల్ పామ్ సాగును పెంచేందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఈక్రమంలో రైతులకు పంట సాగుకు అవసరమైన మొక్కలను అందించేందుకు జిల్లాలోనే నర్సరీలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. స్థానికంగా నర్సరీ ఉండడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లి మొక్కలు తెచ్చుకునే ఇబ్బంది లేకుండా, సబ్సిడీపై నాణ్యమైన మొక్కలు అందుబాటులో ఉంటున్నాయి.
మెదక్ జిల్లాలో 2024–- 25 సంవత్సరంలో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్సాగు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటి వరకు 1,381 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు రైతులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 243 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను సాగు చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు అవసరమై మొక్కల కోసం నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో 43 ఎకరాల విస్తీర్ణంలో నర్సరీ ఏర్పాటు చేశారు. సాంకేతిక పద్ధతుల్లో ఇక్కడ మొక్కలను ఉత్పత్తి చేస్తూ రైతులకు నాణ్యమైన మొక్కలను అందజేస్తున్నారు. ఒక ఎకరా విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోట సాగు చేయడానికి 50 నుంచి 54 మొక్కలు అవసరమవుతాయి. వాస్తవంగా ఒక మొక్క ఖరీదు రూ.193. కాగా రైతులకు కేవలం రూ. 20 రూపాయలకే అందిస్తున్నారు. ప్రభుత్వం 173 రూపాయలను సబ్సిడీగా అందిస్తోంది.
వెయ్యి ఎకరాలకు సరిపడా మొక్కలు రెడీ
ప్రస్తుతం నిజాంపేట మండలం చల్మెడలోని నర్సరీలో వెయ్యి ఎకరాలకు సరిపడా 50 వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయి.12 నెలల పాటు నర్సరీలో పెంచిన ఆరోగ్యవంతమైన పామాయిల్ మొక్కలను మాత్రమే రైతులకు అందజేస్తాం. జిల్లాలో ఆయిల్‌పామ్‌సాగుకు ముందుకు వచ్చే రైతులకు సరిపడా నాణ్యమైన మొక్కలను అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. – ప్రశాంత్, డిప్యూటీ మేనేజర్, లివ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్