- కొండా లక్ష్మణ్ హా ర్టికల్చర్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ దండా రాజిరెడ్డి
ములుగు, వెలుగు: రైతులు ఆదాయం పెంచే పంటలు సాగుచేయాలని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ దండా రాజిరెడ్డి అన్నారు. బుధవారం వర్సిటీకి చెందిన కేవీకే రామగిరి ఖిల్లాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, అధికారులకు కూరగాయల అంటు మొక్కల ఉత్పత్తి, దిగుబడి పై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు ఏడాది పొడవునా అందుబాటులో ఉండేవిధంగా కూరగాయల సాగుచేయాలన్నారు.
కూరగాయలు, పండ్లు, పూల సాగుచేయడం వల్ల మిగతా పంటల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐసీఆర్ ఏటీఏఆర్ఐ జోన్ఎక్స్షేక్, ఎన్, మీరా మాట్లాడుతూ.. అంటు కట్టిన కూరగాయల మొక్కలు వ్యాధులను తట్టుకొని అధిక దిగుబడి ఇస్తాయన్నారు. రైతులకు అంటుకట్టే పద్ధతిపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అనంతరం ఎయిర్ లూమ్స్ సిడ్లింగ్స్ అండ్ ప్లాంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన కృష్ణ కిషోర్ కూరగాయల్లో అంటు కట్టే పద్ధతి, ఉత్పత్తి నాణ్యత, దిగుబడుల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
వర్సిటీ విస్తరణ అధికారి విజయ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలకు, అధికారులకు ఉద్యాన పంటల్లో ఆధునిక సాంకేతికతపై మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలోని అధికారులు ప్రభాకర్ రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ భగవాన్, నటరాజన్, ఆర్ రెడ్డి పాల్గొన్నారు.