టెస్టుల పేరుతో దోచుకుంటున్నరు
కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటళ్ల కాసుల కక్కుర్తి
వైరల్ జ్వరమో.. కరోనానో తెలియాలి కదా అంటున్నరు
జోరుగా రెఫర్ హాస్పిటల్స్, ఆర్ఎంపీల కమీషన్ల దందా
జనగామ, వెలుగు: డాక్టర్లు నాడి పట్టరు.. బీపీ చూడరు.. కానీ టెస్టులు మాత్రం ఫుల్ గా రాస్తున్నరు.. వచ్చింది కరోనా జ్వరమో.. వైరల్ జ్వరమో తెలియాలంటే తప్పదని తేల్చి చెప్తున్నరు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. వందలాదిగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా టైంలోనూ కాసుల కక్కుర్తికి పాల్పడుతున్నాయి. ఇష్టారీతిన టెస్టులు చేయిస్తూ పేషెంట్ల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. హాస్పిటల్స్, ఆర్ఎంపీల కమీషన్ దందా మరింత జోరందుకుంది.
అడ్డగోలు వసూళ్లు
వైరల్ జ్వరమో.. కరోనా జ్వరమో తెలియక పేషెంట్లు భయంతో ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్తున్నారు. ఇలా వచ్చిన వారి నుంచి అడ్డగోలు వసూళ్లు చేస్తున్నారు. హాస్పిటల్కు వచ్చారంటే చాలు డిసీజ్ డయాగ్నసిస్ పేరుతో పదుల సంఖ్యలో టెస్టులు రాస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో జ్వరం వస్తే టైఫాయిడ్, మలేరియా, హిమోగ్రామ్, యూరిన్, బ్లడ్ టెస్టుల వంటివి చేస్తారు.. ఇది కూడా జ్వరం ఎక్కువగా ఉంటేనే చేసేవారు. వీటికి రూ.600 నుంచి 800 వరకు తీసుకునేవారు. కానీ ఇప్పుడు వీటికి రూ.1,200 నుంచి 2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వీటితో పాటు ఎలక్ట్రోలైట్స్, చెస్ట్ ఎక్స్ రే, సిటీ స్కాన్ తదితర టెస్టులూ చేయిస్తున్నారు. సాధారణ రోజుల్లో అయ్యే ఖర్చుకు ప్రస్తుతం కరోనా టైం ఖర్చు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉంటుందని హాస్పిటల్ వర్గాలే చెబుతున్నాయి. దగ్గు ఉంటే చాలు చెస్ట్ ఎక్స్ రేలు, చెస్ట్ సిటీ స్కాన్, కిడ్నీ సంబంధ టెస్టులు రాస్తున్నారు. చెస్ట్ఎక్స్ రేకు రూ. 400 వరకు తీసుకుంటున్నారు. శ్వాస సంబంధిత సిటీ స్కాన్కు గతంలో రూ.5వేల వరకు తీసుకునే వారు. ఇప్పుడు రూ.9 వేల దాక వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అడ్డగోలు వసూళ్లపై పట్టించుకునే వారు కరువయ్యారు. కనీస పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లువారు వ్యవహరిస్తున్నారు.
కమీషన్ల దందా
హాస్పిటల్స్, ఆర్ఎంపీల మధ్య కమీషన్ల దందా జోరుగా సాగుతోంది. చెస్ట్ఎక్స్ రే, చెస్ట్ సిటీ స్కాన్ ల ద్వారా కరోనా పేషెంట్లను గుర్తిస్తున్న కొందరు డాక్టర్లు ట్రీట్ మెంట్కు వేలల్లో గుంజుతున్నారు. మరి కొందరు 20 నుంచి 30 శాతం కమీషన్ తీసుకుంటూ కరోనా పేషెంట్లను హైదరాబాద్లోని హాస్పిటల్స్కు పంపిస్తున్నారు. ఇక పల్లెల్లోని ఆర్ఎంపీలు కమీషన్లకు ఎగబడుతున్నారు. ఎవరికి జ్వరం వచ్చినా హాస్పిటల్స్కు రెఫర్ చేయడం.. ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. పేషెంట్కు అయ్యే బిల్లులో దీన్ని వసూలు చేస్తున్నారు. ఈ కమీషన్లు ఇవ్వాల్సి ఉండడంతో హాస్పిటల్స్, ల్యాబ్ ల మేనేజ్మెంట్లు పేషెంట్ల వద్ద ఎక్కువ మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నాయి.
For More News..