
మెహిదీపట్నం, వెలుగు: గుండెపోటు వచ్చిన వ్యక్తిని కుటుంబసభ్యులు హాస్పిటల్కు తీసుకెళ్లగా మృతిచెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ వారు దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు, సీఐ రఘు కుమార్ కథనం ప్రకారం.. కార్వాన్ భాంజవాడి ప్రాంతానికి చెందిన ఎల్లయ్య(46) ఎలక్ట్రీషియన్. మంగళవారం (ఏప్రిల్ 15) ఉదయం ఆయాసం వస్తోందని చెప్పడంతో కుటుంబసభ్యులు లంగర్ హౌస్ హైకేర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
డాక్టర్లు ఈసీజీ తీసి, ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఎలాంటి ప్రమాదం లేదని, 24 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉండాలని చెప్పారు. కాసేపటికే ఎల్లయ్య ఆరోగ్యం క్షీణించడంతో తమ హాస్పిటల్లో కార్డియో స్పెషలిస్ట్ డాక్టర్లేరని, వెంటనే వేరే హాస్పిటల్కు తీసుకువెళ్లాలని సూచించారు. అంతలోనే అతను మృతి చెందాడు. దీంతో, మృతుడి కుటుంబసభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, బాధితులతో మాట్లాడగా.. వైద్యుల నిర్లక్ష్యం, డేట్అయిపోయిన మందులు ఇవ్వడం వల్లే ఎల్లయ్య చనిపోయాడని ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.