
పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ హాస్పిటల్‌లో డాక్టర్లు లేకపోవడంతో స్టాఫ్‌నర్స్, పేషెంట్ కేర్ వ్యక్తులు కలిసి గర్భిణికి డెలివరీ చేయడంతో బుధవారం రాత్రి పసికందు పురిట్లోనే చనిపోయింది. జఫర్‌గఢ్ మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన కన్నెబోయిన స్రవంతి పురిటినొప్పులు రావడంతో ఉదయం పాలకుర్తి హాస్పిటల్‌కు వచ్చింది.
డాక్టర్ స్వప్న స్రవంతిని చెక్ చేసి నార్మల్ డెలివరీ అవుతుందంటూ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకున్నారు. సాయంత్రం డ్యూటీ ముగియడంతో డాక్టర్లు వెళ్లిపోయారు. రాత్రి 7 గంటల టైంలో స్రవంతికి నొప్పులు ఎక్కువ కావడంతో స్టాఫ్ నర్స్ సరిత, పేషెంట్ కేర్‌లు రజని, రాజు కలిసి డెలివరీ చేసేందుకు ప్రయత్నించారు. రాత్రి 11.30 గంటల టైంలో బేబీని బయటికి తీశారు. పుట్టిన కొద్ది సేపటికే పసికందు చనిపోయింది.
దీంతో డాక్టర్లు లేకపోవడం, సిబ్బంది డెలివరీ చేయడం వల్లే శిశువు చనిపోయిందని స్రవంతి తల్లి రామలీల ఆరోపించారు. నొప్పులు ఎక్కువై బాధపడుతుంటే ఒక్క డాక్టర్ కూడా రాలేదని వాపోయింది.