
చిన్న పిల్లల అక్రమ రవాణాపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆస్పత్రులే కేంద్రంగా పుట్టిన పిల్లలు మాయం అవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ కు చెక్ పెట్టాల్సిందేనని, అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ సందర్భంగా పుట్టిన బిడ్డలు హాస్పిటల్ లో మిస్సయితే ఆ ఆస్పత్రి లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిందిగా సూచించింది.
మంగళవారం (ఏప్రిల్ 15) చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ పై జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై పలు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిందితులు సమాజానికి ఒక ఆపదలా పరిణమించారని పేర్కొంది. ఈ నిందితులు వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిందిగా బెయిల్ లో కండిషన్స్ పెట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఉత్తరప్రదేశ్ లో ఒక వ్యక్తి తనకు కుమారుడు కావాలని, అందుకోసం 4 లక్షల రూపాయలకు బాబును కొనటం ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో బెయిల్ వాదనల సందర్భంగా ధర్మాసనం త్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి ఎలాంటి సీరియస్ నెస్ లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించింది. ‘‘ఈ కేసులో ఎటువంటి అప్పీల్ చేయలేదు.. కేసులో సీరియస్ నెస్ చూపించలేదు. నిందితుడు కొడుకు కావాలని 4 లక్షలకు కొనుగోలు చేశాడు. కొడుకు కావాలంటే చైల్డ్ ట్రాఫికింగ్ పద్ధతిని కాదు అనుసరించాల్సింది. ఆ బాబును దొంగిలించారని తెలిసి ఎలా కొనుగోలు చేస్తాడు.. ఈ కేసులో ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం సరికాదు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో మిగతా వారిని కూడా లొంగిపోవాల్సిందిగా కోర్టు సూచించింది. వారందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాల్సిందిగా ఆదేశించింది సుప్రీం కోర్టు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారని, వారిపై ట్రయల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సిందిగా ఆదేశించింది.
ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల హైకోర్టులు.. చైల్డ్ ట్రాఫికింగ్ పెండింగ్ కేసులను ట్రాక్ చేయాల్సిందిగా ఆదేశించింది. ప్రతి రాష్ట్రంలో ఈ కేసుల స్టేటస్ ఏంటో హైకోర్టులు పర్యవేక్షించి, ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సిందిగా ఆదేశించింది. అదేవిధంగా హాస్పిటల్ లో పిల్లలు మిస్సయితే.. మొదటి స్టెప్ గా ఆ హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
భారత్ లో ప్రతి ఏటా 2 వేల చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు నమోదవుతున్నాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం.. 2022 లో మొత్తం 2250 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా తెలంగాణ, బీహార్లో నమోదైనట్లు బ్యూరో రిపోర్ట్ ద్వారా వెల్లడైంది.