తుంగతుర్తి, వెలుగు: సరైన వైద్యసేవలు అందక నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఇక నుంచి ఆ బాధలు దూరం కానున్నాయని ఎమ్మెల్యే మందుల సామెల్ చెప్పారు. తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ .40 కోట్లతో చేపట్టిన వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద పడకల ఆస్పత్రి ఇక్కడి ప్రజల దశాబ్దాల కలఅని, తన హయాంలో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. 18 నెలల్లోనే భవవాన్ని పూర్తిచేసి అందుబాటులోక తీసుకొస్తామన్నారు.
ఇందులో 30 పైగా డాక్టర్లు, 10 మంది స్పెషలిస్టులు పనిచేస్తారని చెప్పారు. మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్ల రిపేర్లకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ కోటాచలం , వైద్య విధాన పరిషత్ అధికారి వెంకటేశ్వర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్, తహసీల్దార్ వెంకటరెడ్డి, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పాల్గొన్నారు.