ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

సత్తుపల్లి, వెలుగు: వంద పడకల ఆసుపత్రి పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులను కలెక్టర్  వీపీ గౌతమ్   ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ఆసుపత్రి పనులను పరిశీలించారు. ముందుగా ప్రభుత్వ బాలుర జూనియర్  కాలేజీ నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి జి ప్లస్ టు మోడల్ లో నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కాలేజీ బిల్డింగ్​కు అవసరమైన నిధులను రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బస్టాండ్  సమీపంలోని వీఆర్వోల గెస్ట్​ హౌస్ లో లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని, అదనంగా రెండు అంతస్తులు నిర్మించేలా ప్రపోజల్స్​ రెడీ చేయాలని సూచించారు. పాత సెంటర్ యూపీఎస్ లో మనఊరు–మనబడి పనులను, బేతుపల్లి ప్రైమరీ స్కూల్​లో తొలిమెట్టులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాన్ని  పరిశీలించారు. బేతుపల్లి రెవెన్యూ గ్రామంలోని 133 సర్వే నెంబర్ లో పాస్ బుక్స్‌ అందని రైతులకు  ధరణి పోర్టల్ ద్వారా పాస్ బుక్స్‌ జారీ చేసి అందజేశారు. లైబ్రరీ చైర్మన్  కొత్తూరు ఉమామహేశ్వర రావు, అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్, డీసీహెచ్ఎస్​ వెంకటేశ్వర్లు, ఈఈలు ఉమామహేశ్వరరావు, హేమలత, ఆర్డీవో సూర్యనారాయణ, ఎంఈవో రాములు, ఎంపీడీవో సుభాషిణి, కమిషనర్ సుజాత పాల్గొన్నారు.

ఏజెన్సీ భూ సమస్యలను పరిష్కరిస్తాం

పెనుబల్లి: కల్లూరు రెవెన్యూ డివిజన్​లో ఏజెన్సీ భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. మండలంలోని మండాలపాడు గ్రామంలో కలెక్టర్​ వీపీ గౌతమ్ తో కలసి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. అడిషనల్​ కలెక్టర్​ మధుసూధన్, ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసి చెక్కిలాల మోహనరావు, తహసీల్దార్​ రమాదేవి, సర్పంచ్​ మంగమ్మ, ఎంపీటీసీ నిర్మల భారతి, ఎంపీడీవో మహాలక్ష్మి పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి

అశ్వారావుపేట, వెలుగు: మొగళ్లపు చెన్నకేశవరావుకు కాకుండా ఇతరులకు మండల అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తామని ముగ్గురు మహిళా ఎంపీటీసీలు ప్రకటించారు. శుక్రవారం కాంగ్రెస్  పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అశ్వారావుపేట ఎంపీటీసీలు వేముల భారతి, వగ్గెల అనసూయ, సత్యవరపు తిరుమల, కో ఆప్షన్ సభ్యుడు పాషా, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తగరం రాజేశ్, మరియమ్మ, వేముల ప్రతాప్, బండారు మహేశ్, సత్యవరపు బాలయ్య తెలిపారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు.

భద్రాద్రిలో ధనుర్మాసోత్సవాలు షురూ

భద్రాచలం, వెలుగు: దక్షిణ అయోధ్య భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం ధనుర్మాసోత్సవాలు షురూ అయ్యాయి. గోదావరి నుంచి అర్చకులు మేళతాళాల మధ్య తీర్థబిందెను తెచ్చారు. ఏకాంతంగా శ్రీసీతారామచంద్రస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ధనుర్మాస ప్రత్యేక పూజలు చేశారు. తిరుప్పావై సేవాకాలాన్ని ప్రారంభించారు. మధిరకు చెందిన శ్రీమాన్​ వనం వెంకట వరప్రసాద్​ తిరుప్పావై ప్రవచనం చెప్పారు. మార్గళిత్తింగల్​ మది నిరైంద నన్నాళాల్​ అనే తొలి పాశురాన్ని వివరించారు. నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుని కీర్తించడానికి గోదాదేవి గోపికలను పిలిచే ఈ  ఘట్టం వీనులవిందుగా కొనసాగింది. అంతకుముందు ఉదయం శ్రీసీతారామచంద్రస్వామి మూలవరులను బంగారు కవచాలతో అలంకరించి ప్రత్యేక హారతులిచ్చారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. మహిళలకు అమ్మవారి అభిషేక మంజీరాలు పంపిణీ చేశారు. లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన తర్వాత సాయంత్రం దర్బారు సేవ జరిగింది. సంధ్యాహారతిని రద్దు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ స్టేట్​ ఫారెస్డ్  డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఎండీ జి.చంద్రశేఖర్​రెడ్డి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజమండ్రికి చెందిన రాళ్లబండి రాజేశ్వర ప్రసాద్​ స్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1లక్ష విరాళంగా ఇచ్చారు. 

స్కూల్ పక్కన బెల్ట్ షాప్ తొలగించాలి

ఎర్రుపాలెం, వెలుగు: మండలంలోని రామన్నగూడెం స్కూల్​ పక్కనే ఉన్న బెల్ట్​షాపును వెంటనే తొలగించాలని జడ్పీటీసీ శీలం కవిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల సమావేశం ఎంపీపీ దేవరకొండ శిరీష అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కూల్  పక్కనే బెల్ట్ షాపు నిర్వహించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మండల సమావేశానికి అధికారులు రాకపోవడంపై పలువురు సభ్యులు నిలదీశారు. అనంతరం పలు సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్​ తిరుమల చారి పాల్గొన్నారు. 

జూనియర్ కాలేజీ తనిఖీ

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ప్రభుత్వ జూనియర్​ కాలేజీని శుక్రవారం డీఐఈవో సులోచన రాణి తనిఖీ చేశారు. ఇండస్ట్రియల్  ఏరియాలోని వర్క్ షాపులో ఏఈటీ విద్యార్థుల శిక్షణను పరిశీలించారు. ప్రతీ రోజూ శిక్షణకు హాజరై ప్రయోజకులు కావాలని సూచించారు. తహసీల్దార్, ఎస్టీవో ఆఫీసుల్లో ట్రైనింగ్​ తీసుకుంటున్న ఓఏ విద్యార్థులను కలిశారు. గరుడ యాప్, ఫామ్–​-6, జనన, మరణాల నమోదు చేసే తీరును పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్​ శ్రీనివాస్​యాదవ్, ఏటీవో విష్ణురావు, ఇన్​చార్జి ప్రిన్సిపాల్​ వరరాజు, లెక్చరర్​ ఆనంద్​బాబు ఉన్నారు.

మొబైల్ బ్యాంకింగ్  యాప్  ప్రారంభం

ఖమ్మం టౌన్, వెలుగు: డీసీసీబీ మెయిన్  బ్రాంచ్ లో శుక్రవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో మొబైల్ యాప్ ను డీసీసీబీ చైర్మన్​ కూరకుల నాగభూషయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్లు తమ బ్రాంచ్ ను సంప్రదించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మొబైల్ యాప్ ద్వారా రోజుకు రూ.50 వేల నగదు ఐఎంపీఎస్ ద్వారా బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. బ్యాంక్​ క్యాలెండర్, డైరీలను రిలీజ్​ చేశారు. బ్యాంక్​ సీఈవో అట్లూరి వీరబాబు మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ, వ్యవసాయేతర సేవలు అందించడంతో పాటు డిజిటల్ లావాదేవీలు జరపడం హర్షణీయమన్నారు. త్వరలోనే ఫోన్ పే, గూగుల్ పే సేవలు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. 

బతికున్నా చంపేసిన్రని కలెక్టర్​కు ఫిర్యాదు

సత్తుపల్లి, వెలుగు: బతికున్న వ్యక్తిని చనిపోయాడని ధృవీకరించి అతనికి వృద్యాప్య ఫించన్ ను నిలిపివేశారని కిష్టారం ఎంపీటీసీ పాలకుర్తి సునీత శుక్రవారం కలెక్టర్  వీపీ గౌతమ్​కు ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి వచ్చిన కలెక్టర్ ను కలిసి గ్రామానికి చెందిన నక్క పెద్దసుందరం రెండేళ్ల క్రితం చనిపోయినట్లు ధృవీకరించడంతో వృద్ధాప్య పింఛన్  ఆగిపోయిందని తెలిపారు. దీంతో వృద్ధుడు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యుడైన గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా కార్యదర్శి అనేక తప్పిదాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.