12 హాస్పిటళ్లు తిరిగినా పట్టించుకోలే.. ఊరికి వాపస్ వెళ్తూ యాక్సిడెంట్లో మృతి

12 హాస్పిటళ్లు తిరిగినా పట్టించుకోలే.. ఊరికి వాపస్ వెళ్తూ యాక్సిడెంట్లో మృతి

నిజామాబాద్ నుంచి హైదరాబాద్‍ రెఫర్
తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి

నిజామాబాద్, వెలుగు: అంబులెన్స్‌‌‌‌లో చావుబతుకుల మధ్య పేషెంట్.. ఓ పక్క భార్య, మరోపక్క కొడుకు.. ముందు డ్రైవర్.. హైదరాబాద్‌‌‌‌లో ఒకటి కాదు, రెండు కాదు.. సర్కారు, ప్రైవేటు అనే తేడా లేకుండా ఏకంగా 12 హాస్పిటళ్లు తిరిగిన్రు. బెడ్లు లేవని ఒకకాడ, కరోనా కావచ్చని ఒకకాడ.. ఇలా ఎక్కడా చేర్చుకోలేదు. చేసేది లేక దేవుడి మీద భారం వేసి నిజామాబాద్‌‌‌‌కు తిరుగుముఖం పట్టగా మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరిగి పేషెంట్‌ చనిపోయాడు. దయనీయమైన ఈ ఘటన వివరాలివి.. బాధితుల కథనం ప్రకారం, నిజామాబాద్‌లోని కోటగల్లికి చెందిన ఉప్పులపు సాయిరెడ్డి అనే మాజీ కౌన్సిలర్ డయాబెటిక్ పేషంట్. కొద్ది రోజుల కింద ఇక్కడి ఓ ప్రైవేట్ హాస్పిటల్‍లో ట్రీట్‌‌మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యాడు. మూడు రోజుల కింద ఆయనకు ఎక్కిళ్లు ఎక్కువకావడంతో భార్య, కొడుకు శ్రీనివాస్ రెడ్డి కలిసి మరోసారి అదే హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షలు చేసి, నిజామాబాద్ లోని జీజీహెచ్‍కు రెఫర్ చేశారు. మంగళవారం రాత్రి జీజీహెచ్‍ వెళ్లాక అక్కడి డాక్టర్లు సాయిరెడ్డిని అడ్మిట్ చేసుకోలేదు. కనీసం రోగిని పరీక్షించకుండానే కరోనా కావచ్చనే అనుమానంతో హైదరాబాద్ రెఫర్ చేశారు.

హైదరాబాద్లో నరకం
నిజామాబాద్ నుంచి అంబులెన్సులో హైదరాబాద్‍ వెళ్లిన బాధితులు అక్కడ నరకం చూశారు. జీజీహెచ్ రెఫర్ చేసిన ఉస్మానియా హాస్పిటల్‌‌కు తీసుకెళ్లగా కరోనా కావొచ్చని, చేర్చుకోలేమని అన్నారు. అక్కడి నుంచి చెస్ట్ హాస్పిటల్ కు, అటు నుంచి నిమ్స్, యశోద, సన్‍షైన్‍, గ్లోబల్, ఇట్ల 12 హాస్పిటళ్లు తిరిగారు. అన్నిచోట్లా అదే సమాధానం. కరోనా కావొచ్చు లేదంటే బెడ్లు లేవంటూ నిరాకరించారు. మంగళవారం రాత్రి 11 గంటల టైమ్‌‌లో హైదరాబాద్ చేరుకున్న వారు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు తిరిగి తిరిగి అలసిపోయారు. మరోవైపు అంబులెన్స్ డ్రైవర్ తాను వెళ్ళిపోతాననడంతో తల్లికొడుకులకు ఏం చేయాలో తోచలేదు. ఏ హాస్పిటల్‍లోనూ అడ్మిషన్ దొరకకపోవడంతో దేవుడిపై భారం వేసి
నిజామాబాద్ తిరుగు పయనమయ్యారు.

అంతలోనే రోడ్డు ప్రమాదం
వీరు ప్రయాణిస్తున్న అంబులెన్సు బుధవారం అర్థరాత్రి కామారెడ్డి సమీపంలోకి రాగానే రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో అంబులెన్సులో ఉన్న పేషెంట్‍ సాయిరెడ్డి అక్కడికక్కడే చనిపోగా, ఆయన భార్య, కొడుకు గాయపడ్డారు.

జీజీహెచ్‌లో చేర్చుకుంటే బతికేవాడు..
కరోనా పరీక్షలు చేయకుండానే కరోనా పాజిటివ్ అనే అనుమానంతో మా నాన్నను జీజీహెచ్‌లో చేర్చుకోలేదు. ఇక్కడే అడ్మిట్ చేసుకుంటే మా నాన్నబతికేవాడు. హైదరాబాద్‌లో ఏ హాస్పిటల్ లోనూ మా తండ్రిని చేర్చుకోలేదు. తిరిగి వస్తుంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
– శ్రీనివాస్ రెడ్డి, మృతుని కొడుకు

For More News..

సర్కార్ దవాఖాన్లకు పోతలేరు

అల్లు అర్జున్ తో సినిమా చాన్స్ అంటూ.. అమ్మాయిలతో..