- వాతావరణ పరిస్థితులే కారణమంటున్న డాక్టర్లు
- రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు
- కరువైన వైద్య శిబిరాలు
- వైద్యాధికారులు స్పందించడంలేదంటున్న బాధితులు
భద్రాచలం, వెలుగు మారుమూల మన్యం ప్రాంతం జ్వరాలతో తల్లడిల్లుతోంది. సాధారణంగా వానాకాలంలో ముసురు పెట్టే టైంలో జ్వరాలు విజృంభిస్తాయి. కానీ అందుకు భిన్నంగా ఈసారి ముసురు కంటే ముందే పల్లెలు జ్వరాలతో సతమవుతున్నాయి. పల్లెల్లో ఎటు చూసినా గ్రామాలకు సుస్తీ చేసిందా అన్నట్లు తయారైంది. జనాలు తీవ్రమైన జ్వరాలతో మంచమెక్కి విలవిల్లాడుతున్నారు. ఐటీడీఏ పరిధిలోని దుమ్ముగూడెం, చర్ల, పినపాక, అశ్వాపురం, కరకగూడెం, అశ్వారావుపేట తదితర మండలాల్లోని గ్రామాల్లో తీవ్రమైన ఒళ్లునొప్పులు,
చలితో వణుకు, నీరసం, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆర్ఎంపీలను ఆశ్రయించి రోజుల తరబడి వైద్యం చేయించుకుంటున్నారు. దుమ్ముగూడెం మండలంలోని మారాయిగూడెం, చర్ల మండలంలోని మారుమూల ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గ్రామాల్లో సైతం జ్వరాలు గిరిజనులను వేధిస్తున్నాయి. చాలా మంది భద్రాచలం ఏరియా ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. కాస్తో, కూస్తో ఆర్థికంగా ఉన్నవారు భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి వైద్యం పొందుతున్నారు.
అధికంగా డెంగీ కేసులే నమోదు...
జ్వర పీడితులతో భద్రాచలంలోని ఆసుపత్రిలో వార్డు నిండిపోతోంది. వీటిలో ఎక్కువగా డెంగీ కేసులు ఉన్నాయి. పీహెచ్‌సీల వారీగా మొత్తం 104 కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇంతకు డబుల్ కేసులు ఉన్నట్లు అనధికారికంగా తెలుస్తోంది. మలేరియా సహ ఇతర జ్వరాలు సైతం ఇప్పటి వరకు 71 వరకు కేసులు నమోదయ్యాయి. చర్ల పీహెచ్ సీ పరిధిలో14, సత్యనారాయణపురంలో 2, పర్ణశాలలో ఒకటి, నర్సాపురంలో 6, దుమ్ముగూడెంలో 3, అశ్వాపురం పీహెచ్సీ పరిధిలో 15 డెంగీ కేసులు ఉన్నాయి. పినపాక, కరకగూడెం మండలాల్లో సైతం డెంగీ కేసులే ఎక్కువగా నమోదయ్యాయి. జిల్లాలోని 29 పీహెచ్‌సీల పరిధిలో జ్వరాల కేసులు ఎక్కువగానే ఉన్నాయి.
దిక్కూమొక్కూ లేని మన్యం..
భద్రాచలం ఐటీడీఏ ప్రాంతానికి అడిషనల్ డీఎంహెచ్‌వో పోస్టు ఉంది. కానీ ఈ పోస్టుకు కూడా డీఎంహెచ్‌వోనే ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈమె భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉంటారు. మన్యంలో గిరిజనులకు వైద్యం అందించేందుకు, వైద్యసేవలను పర్యవేక్షించేందుకు ఈ పోస్టును ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ పని చేస్తున్న డాక్టర్‌ను తప్పించి డీఎంహెచ్‌వోకు బాధ్యతలు అప్పగించారు. దీంతో మారుమూల గిరిజన పల్లెల్లో ఆదివాసీలకు సరైన వైద్యం అందడం లేదు. పర్యవేక్షించే వారు లేకపోవడంతో వైద్యం అందని ద్రాక్షాగానే మారింది. కనీసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే నాథుడే లేకుండాపోయాడు. శానిటేషన్ జరుగుతుందా.? లేదా..? అని ఆరా తీసే వారూ కరువ్వాయ్యారు. కనీసం సమాచారం కోసం ఫోన్‌చేసినా స్పందించేవారు లేకుండాపోయారు.
క్లైమేట్ చేంజ్ కావడంతోనే...
ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగానే జ్వరాలు వస్తున్నాయి. విపరీతమైన వేడి కారణంగా కూడా శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల డెంగీ కూడా వస్తోంది. అందుకే ప్రత్యేక వైద్య బృందాలను పంపించి జ్వర పీడితుల నుంచి బ్లడ్సేకరించి టెస్ట్ చేయించాం. కరకగూడెం మండలంలో కొన్ని పాజిటివ్స్ వచ్చాయి. లోకల్డాక్టర్లతో వైద్య శిబిరాలు పెట్టించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాం.
డాక్టర్శిరీష, డీఎంహెచ్‌వో ఎవరూ పట్టించుకోవట్లే...
మన్యంలో గిరిజనులకు వైద్యం అందట్లే. ఎవరూ పట్టించుకోవట్లే. కనీసం వైద్య శిబిరాలు పెట్టేవారు లేరు. డెంగీ, విష జ్వరాలతో ప్రైవేట్ఆసుపత్రికి పోయే స్తోమత గిరిజనులకు లేదు. సర్కారు వైద్యం గ్రామాలకు చేరట్లే. ఎన్నిసార్లు చెప్పినా ఆఫీసర్లు స్పందించడం లేదు.
చెరుకూరి సతీశ్‌కుమార్, గరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు