దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే.. మార్చి 27వ తేదీ సోమవారం నుంచి ముంబైలోని ఆస్పత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. కోవిడ్ వార్డులను రీ ఓపెన్ చేశాయి చాలా ఆస్పత్రులు. ముంబై సిటీ వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్ మెంట్ వార్డులు ఓపెన్ చేయటం చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర వ్యాప్తంగా మార్చి 26వ తేదీ ఆదివారం ఒక్క రోజే 400 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2 వేలకు చేరింది. ఆదివారం ఒక్క రోజే ముంబైలో 123 కేసులు నమోదు కాగా.. వీరిలో 17 మంది ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ గా జాయిన్ అయ్యారు. నాలుగు రోజుల్లోనే 43 మంది కరోనా బాధితులు.. వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 21 మంది ఆక్సిజన్ సపోర్ట్ అవసరం కావటంతో.. కరోనా వార్డులను ఓపెన్ చేశాయి ప్రైవేట్ ఆస్పత్రులు.
ముంబైలో లీలావతి ఆస్పత్రి సీఈవో రవి శంకర్ మాట్లాడుతూ.. కోవిడ్ పరీక్షల సంఖ్య పెరిగిందని.. ఈ క్రమంలోనే 15 బెడ్స్ తో స్పెషల్ వార్డ్ ఓపెన్ చేసినట్లు వెల్లడించారు. దీని కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించామని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారాయన. బొంబాయ్ ఆస్పత్రిలో 10 బెడ్స్ తో వార్డు ఏర్పాటు చేయగా.. హిరానందినీ ఆస్పత్రిలో 12 బెడ్స్ తో స్పెషల్ వార్డు ఓపెన్ చేయటం కలకలం రేపుతుంది. కరోనా బాధితుల సంఖ్య వాస్తవ లెక్కల కంటే పెరుగుతుండటం వల్లే.. వార్డులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయా ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.