ఎమ్మెల్యేను నేనే.. ఇంకెవ్వడూ లేడు

ఎమ్మెల్యేను నేనే.. ఇంకెవ్వడూ లేడు
  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్​ హాట్ కామెంట్స్

మోత్కూరు, వెలుగు: ‘ తుంగతుర్తికి ఎమ్మెల్యేను నేనే.. ఇంకెవ్వడూ లేడు. ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా..  స్థానిక ఎన్నికల్లో టికెట్​కావాలన్నా..  నేను సంతకం పెడితేనే వస్తయ్.. కార్యకర్తలు ఎవరి మాటలు నమ్మొద్దు.. ఎక్కడికి పోవద్దు. చిల్లర మల్లర గాళ్లూ జాగ్రత్త ’ అని ఎమ్మెల్యే మందుల సామెల్​హాట్ కామెంట్స్ చేశారు. 

డీసీసీ ఉపాధ్యక్షుడి ఎంపికలో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకున్నారని ప్రచారం జరగడంతో పాటు ఇటీవల ఎమ్మెల్యేకు  వ్యతిరేకంగా కొందరు పార్టీ నేతలు మీటింగ్​నిర్వహించి చేసిన కామెంట్స్​చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆదివారం ఎమ్మెల్యే సామెల్ మోత్కూరులో మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తించి.. అధిష్టానం టికెట్ ఇచ్చిందని, ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని, అందుకు కార్యకర్తలు కష్టపడి పని చేశారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నడిపించేది సీఎం అయితే జిల్లాకు మంత్రి అని,  నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ఫైనల్ అని స్పష్టం చేశారు. తుంగతుర్తికి 15 ఏండ్లుగా కాంగ్రెస్ ప్రతినిధి లేడని, కార్యకర్తల కష్టంతో గెలిచిన తాను కేడర్ కు అన్ని విధాలా అండగా ఉంటానని హమీ ఇచ్చారు. 

స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్లు అన్ని స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవాలని, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.  నియోజకవర్గ అభివృద్ధికి రూ.1300 కోట్ల నిధులు తెచ్చానన్నారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నతేలు పాల్గొన్నారు.