ఖమ్మంలో ఉండేదెవరో .. పోయేదెవరో?

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నేతలు పార్టీ నాయకత్వంపై ఉన్న అసంతృప్తిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బయటపెడుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని నేతల మాటలు, వారు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు చర్చనీయాంశాలుగా మారాయి. రానున్న రోజుల్లో జిల్లాలో  ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. 

ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ సభ నిర్వహించేందుకు సమాయత్తమైంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి  కొత్తగూడెం, పాలేరు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర రావు, కందా ఉపేందర్ రెడ్డి డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ మీటింగ్ కు హాజరుకాలేదు. ఈ క్రమంలో  పార్టీలో ఉండేదేవరు? పోయేదేవరన్న అంశంపై జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

గతకొంతకాలంగా పార్టీపై తుమ్మల,పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొంగులేటి గత కొన్నిరోజులుగా చేస్తున్న కామెంట్స్ చూస్తే ఆయన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు అర్థమవుతోంది. అటు తుమ్మల కూడా తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే  ప్రకటించారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం సిట్టి్ంగ్ లకే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ఆ క్రమంలో తుమ్మల కూడా పార్టీ మారుతారన్న  ప్రచారం జోరందుకుంది. వారిద్దరూ బీజేపీలో చేరనున్నారన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఖమ్మం జిల్లా రాజకీయ చిత్రం ఎలా మారనుందన్న అంశంపై క్లారిటీ రావాలంటే ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభ వరకు వేచి చూడాల్సిందే.