Shocking Incident: వామ్మో.. షాకింగ్ వీడియో.. వినుకొండ హత్య ఘటనను మించిపోయిందిగా..

Shocking Incident: వామ్మో.. షాకింగ్ వీడియో.. వినుకొండ హత్య ఘటనను మించిపోయిందిగా..

చెన్నై: నేరాల కట్టడికి పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరికి ఏమాత్రం భయం ఉండటం లేదు. బహిరంగంగా హత్యలకు తెగబడుతున్నారు. ఏపీలోని వినుకొండలో ఇటీవల పట్టపగలు, నడిరోడ్డుపై ఏం జరిగిందో వీడియో చూసే ఉంటారు. అలాంటి ఘటనే  తమిళనాడులోని ధర్మపురి తాలూకాలో ఉన్న ఎలక్కియాంపట్లో వెలుగుచూసింది. నలుగురు వ్యక్తులు పక్కా ప్లాన్ ప్రకారం ఒక హోటల్లో జొరబడ్డారు. ఆ హోటల్లో ఉద్యోగిగా పనిచేసే మహ్మద్ ఆషిక్ను టార్గెట్ చేశారు. 25 ఏళ్ల ఆ యువకుడిని నలుగురు నిందితుల్లో ఒకరు కత్తితో పొడిచారు. మరొకరు రాడ్డుతో కొట్టి దాడి చేశారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ హత్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆషిక్పై దాడి గురించి తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఆ హోటల్ దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న ఆషిక్ను ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ ఆషిక్ ఆసుపత్రికి చేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఈ హత్యకు కారణాలపై ధర్మపురి పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆషిక్ ఒక మహిళతో చనువుగా ఉండేవాడని, రెండు నెలల క్రితం ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి ప్రతిపాదన చేశాడని చెప్పారు. ఆమె పెళ్లికి అంగీకరించలేదని, మళ్లీ ఆమెను కలవాలని చూస్తే చంపేస్తామని ఆమె సోదరులు జనరంజన్, హంసప్రియన్ బెదిరించారని తెలిపారు. అయినప్పటికీ ఆషిక్ ఆమెతో టచ్లో ఉండేందుకు ప్రయత్నించడంతో.. విషయం తెలుసుకున్న ఆమె ఇద్దరు సోదరులు మరో ఇద్దరితో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ మహిళ కుటుంబం పెళ్లికి ఒప్పుకోకపోవడం, ఆషిక్ ఆమెను వదులుకోలేక సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించడమే హత్యకు కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.