- ప్రమాదకరమైన రంగులు, మసాలాపొడుల వినియోగం
- క్వాలిటీ చెక్లేకుండా అమ్మకాలు
- ఫిర్యాదులు వచ్చినప్పుడే ఆఫీసర్లలో కదలిక
- 2017 నుంచి నగరపాలక హెల్త్ ఆఫీసర్ పోస్టు ఖాళీ
జిల్లాలోని హోటళ్ల యాజమాన్యాలు కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. పట్టణం, పల్లె తేడా లేకుండా అంతా ఇదే పద్ధతి నడుస్తోంది. క్వాలిటీ తనిఖీ చేయకుండా వారాలతరబడి నిల్వ చేసిన మటన్, చికెన్‌తో తయారు చేసిన పదార్ధాలను కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. ఇలా తయారైన ఆహారపదార్థాలు పాడుకాకుండా కలర్స్, మసాలా తదిర పొడులను వినియోగిస్తున్నారు. కస్టమర్ల ఫిర్యాదు చేసినప్పుడు హడావిడి చేస్తున్న ఆఫీసర్లు తరువాత పట్టించుకోకపోవడం పెద్దశాపంగా మారింది. జిల్లా కేంద్రమైన మున్సిపల్ కార్పొరేషన్లో కీలకమైన హెల్త్ ఆఫీసర్ పోస్టు ఏండ్ల తరబడి ఖాళీగా ఉంది.
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని చిన్నాపెద్దా హోటల్స్500కు పైగా ఉన్నాయి. అందులో ఒక్క నిజామాబాద్ నగరంలోనే వంద వరకు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలైన బోధన్, ఆర్మూర్, భీంగల్ తోపాటు33 మండల కేంద్రాలు కలిపి 400 దాకా ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. నిత్యం కొన్ని హోటల్స్, రెస్టారెంట్ల బిజినెస్ రోజుకు రూ.2 లక్షలు పైమాటే. రూ.40 వేల బిజినెస్ జరిగే కర్రీపాయింట్లూ ఉన్నాయి. గ్రామాల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు రూ.25 వేలకు తగ్గకుండా బిజినెస్ నడుపుతున్నారంటూ వాటి ఆదరణ అర్థం చేసుకోవచ్చు.
అయితే కేవలం వ్యాపారం మీదున్న ఫోకస్‌ను క్వాలిటీ విషయంలో నిర్వాహకులు పక్కనబెడుతున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా దాదాపు అన్ని హోటళ్లలో ఇదే తంతు నడుస్తోంది. వారాల కొద్దీ నిలువ చేసిన చికెన్, మటన్‌తో వంటలు చేస్తున్నారు. ఐదురోజులకోసారి గ్రేవీ రెడీ చేసి వడ్డిస్తున్నారు. టేస్ట్ కోసం ప్రమాదకర పేస్టులు, పొడులు కలుపుతున్నారు. అపరిశుభ్ర కిచెన్‌లో కుకింగ్చేస్తున్నారు. నిబంధనల ప్రకారం హోటల్స్ కిచెన్‌లో పనిచేసే వంటవారు, సర్వింగ్ సిబ్బంది ఆరోగ్యాన్ని ప్రతీ ఆరు నెలలకోసారి చెక్ చేసి వారికి అంటువ్యాధులులేవని ఆఫీసర్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ ఇవేవీ అమలుకావడంలేదు.
విస్తుబోయే నిజాలు
నగరంలోని ప్రముఖ హోటల్స్‌లో గత వారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ టీం ఆఫీసర్లు నిర్వహించిన రైడ్స్‌లో విస్తుబోయే విషయాలో వెలుగు చూశాయి. నెల రోజులు పైబడి ఫ్రిజ్‌లో నిల్వ చేసిన 122 కేజీల చికెన్, మటన్‌ను గుర్తించారు. కుళ్లిపోయిన మాంసంతో చేసిన ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. కుళ్లిపోయి బూజుపట్టిన క్యారెట్, బీట్రూట్ ఇతర కూరగాయలు, అనుమానాస్పద మసాల పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు.
నిత్యం వందల కొద్దీ ప్రజలు విజిట్చేసే నగరంలోని ప్రముఖ స్వీట్ హోటల్ అపరిశుభ్ర కిచెన్ పరిసరాలు చూసి విస్తుబోయారు. మిర్చి కాంపౌండ్‌లో అమ్మకాలకు పెట్టిన మసాలా పౌడర్ల శాంపిళ్లను పది షాప్‌ల నుంచి సేకరించి టెస్ట్‌ల కోసం ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు వచ్చాక కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమవుతోంది.
ఎంహెచ్వో పోస్టు ఖాళీ
నిజామాబాద్ నగరంలో కీలకమైన హెల్త్ ఆఫీసర్ పోస్టు 2017 నుంచి ఖాళీగా ఉంది. ఎంబీబీఎస్ చేసిన వ్యక్తిని ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎంహెచ్‌వోగా అపాయింట్ చేస్తారు. హోటల్స్‌తో పాటు మటన్, చికెన్, ఫిష్ సెంటర్లు సందర్శించి వాటి నాణ్యతను చెక్ చేశాకే అమ్మకాలను ఓకే చేయాలి. 2017లో డాక్టర్ సిరాజుద్దీన్ రిటైర్మెంట్ తరువాత ఈ పోస్టు ఇంకా భర్తీ కాలేదు. జిల్లాలోని ఇతర మూడు మున్సిపాలిటీల పరిస్థితి అంతే ఉంది. పల్లెల్లో అయితే అడిగే నాథుడే లేడు.