
ఇంట్లోమొక్కలు పెంచుకోవడం వల్ల ఇల్లు ఆకర్షణీయంగా మారుతుంది. అంతేకాదు ఇండోర్ ప్లాంట్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. వీటితో చాలారకాల వైరస్లను తరిమికొట్టొచ్చు... గాలిని శుభ్రపరచొచ్చు. మరి ఇంటికి అందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఇండోర్ మొక్కల్లో కొన్నింటి గురించి.. వాటి కుండీల ఎంపిక గురించి తెలుసుకుందాం. .
ఆథూరియం : పెద్దపెద్ద ఆకులతో, రంగురంగుల పూలతో కనిపించే మొక్క ఆంధూరియం. ఇది ఇంటికి అందాన్ని తేవడమే కాదు... గాల్లోని అమ్మోనియా, ఫార్మాల్డీహైడ్, టోలిన్, కైలిన్ వంటి విష రసాయనాలను పీల్చుకుని గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది.ఆకులు హార్ట్ షేప్ లో కనువిందు చేస్తే... పూలు ఎరుపు, తెలుపు రంగులో ఏడాది పొడవునా పూస్తాయి. ఈ మొక్కను మైక్రో కట్టింగ్స్ ద్వారా పెంచుకోవచ్చు. ఎక్కువ సంఖ్యలో పెంచుకోవాలంటే బజారులో దొరికే ప్లగ్ ట్రేలు వాడాలి. చిన్న ట్రేలలో ముందుగా పెంచి, ఆ తరువాత పెద్ద కుండీల్లోకి మార్చాలి.
లిల్లీ పీస్ :ఇంట్లో నాలుగు గోడల మధ్య పెంచే మొక్కల్లో పీస్ లిల్లీ ఒకటి. ముదురుపచ్చని ఆకులు, తెల్లని పూలతో ఆకర్షించే ఈ మొక్క ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందమైన కుండీలో ఈ మొక్కను నాటుకుంటే హాల్లో టీవీ పక్కన, రీడింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు. ఈ మొక్కను పెంచే కుండీలోని మట్టి ఎల్లప్పుడూ కొంచెం తేమగా ఉండేట్టు చూసుకుంటే సరిపోతుంది.
Also Read : కీరాతో అదిరిపోయే వంటకాలు.. ఇలా ట్రై చేయండి
మనీ ప్లాంట్: గాజు బాటిల్స్, కప్పులు, కుండీలు... ఇలా ఎందులోనైనా పెరిగే మొక్క మనీ ప్లాంట్. ఇంటికి, కిటికీలకు కూడా ఈ తీగ జాతి మొక్క అందంగా అల్లుకుపోతుంది. ఎలాంటి వాతావరణంలోనైనా పెరిగే ఈ మొక్క ఇంట్లో ఉంటే ఇంటి అందంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొద్దిపాటి వెలుతురులో పెరిగే ఈ మొక్కకు రెండు మూడు రోజులకోసారి నీరు పోస్తే సరిపోతుంది.
వెదురు మొక్క : వెదురు మొక్క టీపాయ్ లు, స్టడీటేబుల్స్ మీద అందంగా ఉంటుంది. చిన్న గాజు పాత్రలో వుంచి అప్పుడప్పుడూ నీరు పోస్తూ వుంటే నెలల తరబడి పచ్చదనాలను పంచుతుంది. ఈ మొక్క, అంతేకాదు గాలిలోని హానికారక రసాయనాలను కూడా స్వచ్ఛంగా మారుస్తుంది.
స్నేక్ ప్లాంట్: గాలిని క్లీన్ చేసే మొక్కగా నాసా గుర్తించిన స్నేక్ ప్లాంట్ బాత్రూంలలో ఉంచేందుకు. అనువుగా ఉంటుంది. ఈ మొక్కను పెంచడం చాలా సులభం. వారం రోజుల పాటు నీళ్లుపోయడం మర్చిపోయినా పచ్చని ఆకులతో ఈ మొక్క అందర్నీ ఆకర్షిస్తుంది. కేవలం ఈ మొక్కలే కాదు చామంతి, కలబంద, అరికాపామ్ లాంటి మొక్కలు కూడా ఇంటికి అందంతో పాటు మంచి ఆరోగ్యాన్నిస్తాయి.
కుండీల ఎంపిక : మొక్కలు పెంచుకోవడానికి అనేక రకాల కంటెయినర్లు అందుబాటులో ఉన్నాయి. సిరామిక్, సిమెంట్, మెటల్, ఉడెస్, ప్లాస్టిక్ ....ఇలా రకరకాల కుండీలు ఉన్నాయి. అయితే మెటల్, ఉడెన్ కుండీలు ఈ మొక్కలకు అనుకూలం కావు. కావాలంటే సంచుల కుండీల్లో ఈ మొక్కల్ని పెంచుకోవచ్చు. నీళ్లు పోయాలి మొక్కలకు క్రమంతప్పకుండా నీళ్లు పోస్తేనే మంచిగా ఎదుగుతాయి. ఇండోర్ ప్లాంట్స్ కు వారానికి రోజు సరిపడా నీళ్లు పోస్తే సరిపోతుంది.
పెస్ట్ కంట్రోల్ : ఇండోర్ ప్లాంట్స్ కు పెస్టిసైడ్స్ ఉపయోగించకూడదు. వాటివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పెస్ట్ కంట్రోల్ కోసం ఆర్గానిక్ పద్ధతుల్ని ఎంచుకోవాలి.