వ్యక్తి సజీవ దహనం

వ్యక్తి సజీవ దహనం
  • ఇంటి పైకప్పు కూలి వైర్లు తెగడంతో మంటలు
  • జగిత్యాల జిల్లా మ్యాడంపల్లిలో ఘటన

మల్యాల, వెలుగు : ఇంటి పైకప్పు కూలి, కరెంట్‌‌‌‌ షార్ట్‌‌ సర్క్యూట్‌‌ జరగడంతో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లిలో బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన గాతం తిరుపతి (37) ట్రాక్టర్‌‌ డ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కొడిమ్యాల పీఎస్‌‌లో హెడ్‌‌కానిస్టేబుల్‌‌గా పనిచేస్తూ, పిల్లలతో కలిసి కరీంనగర్‌‌లో ఉంటోంది. బుధవారం రాత్రి తిరుపతి ఒంటరిగా ఇంట్లో నిద్రించాడు. అర్ధరాత్రి టైంలో పైకప్పు కూలడంతో కరెంట్‌‌ వైర్లు తెగి షార్ట్‌‌ సర్క్యూట్‌‌ జరగడంతో మంటలు చెలరేగాయి.

బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో తిరుపతి ఇంట్లోనే సజీవ దహనమయ్యాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు, ఫైర్‌‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేసిన అనంతరం తిరుపతి డెడ్‌‌బాడీని బయటకు తీశారు. సీఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి గాతం దేవమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మల్యాల ఎస్సై నరేశ్‌‌ తెలిపారు.