అనంతపూర్ లో షార్ట్​సర్క్యూట్​తో ఇల్లు దగ్ధం..రూ.17 లక్షల ఆస్తి నష్టం

అనంతపూర్ లో షార్ట్​సర్క్యూట్​తో ఇల్లు దగ్ధం..రూ.17 లక్షల ఆస్తి నష్టం

బజార్ హత్నూర్, వెలుగు: షార్ట్​సర్క్యూట్​తో ఓ ఇల్లు దగ్ధమై దాదాపు రూ.17 లక్షల నష్టం జరిగింది. బజార్​హత్నూర్​ మండలంలోని అనంతపూర్ గ్రామానికి చెందిన కొరెంగా హనుమంతు సోమవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇళ్లంతా వ్యాపించాయి. దీంతో దిద్రలేచిన వారంతా ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలు అర్పేలోగానే ఇల్లంతా కాలి బూడిదైంది. ఇంట్లో ఉన్న రూ.2.50 లక్షల నగదు, 10 క్వింటాళ్ల కందులు, ఫర్నీచర్, ఇతర వస్తువులన్నీ కాలిపోయాయి. ఆర్ఐ నూర్ సింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.

సుమారు రూ. 17 లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ సోయం బాపూరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల సాయం అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోరెడ్డి నారాయణ తదితరులున్నారు.