మండీ.. మండీ.. కుప్పకూలిన బిల్డింగ్

  • మంటలను అదుపు చేసేందుకు మరో 3 రోజులు పట్టే చాన్స్
  • రెండో రోజంతా ఎగసిపడిన మంటలు
  • ఫైర్​సేఫ్టీ లేకపోవడం, పరిమితికి మించి ముడి సరుకు స్టోర్​చేయడమే ప్రధాన కారణమని గుర్తింపు
  • అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం

జీడిమెట్ల, వెలుగు:జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదానికి గురైన ఎస్ఎస్ వీ ఫ్యాబ్ ఇండస్ట్రీ బిల్డింగ్ బుధవారం ఉదయం కుప్పకూలింది. దాదాపు 20 గంటలపాటు లోపలికి లోపల తగలబడుతూనే ఉండడంతో జీ+3 బిల్డింగ్ దానంతట అదే నేలకొరిగింది. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. కంపెనీ లోపల ఫైర్​సేఫ్టీ లేదని, పరిమితికి మించి ప్లాస్టిక్​సంచులు, తయారీకి ఉపయోగించే ముడి సరుకును స్టోర్​చేశారని ఫైర్​సేఫ్టీ అధికారులు గుర్తించారు.

మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చేందుకు మరో మూడు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. కాగా మంగళవారం నుంచి 10 ఫైర్​ఇంజిన్లు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఫైర్​సిబ్బంది, డీఆర్ఎఫ్​టీమ్స్ కలిపి దాదాపు 100 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రెండు రోజుల్లో దాదాపు 150 వాటర్​ట్యాంకర్లను మంటలను ఆర్పేందుకు వాడారు.

యాజమాన్యం నిర్లక్ష్యమే నిండా ముంచింది

ఎస్ఎస్ వీ ఫ్యాబ్​ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అంత పెద్ద కంపెనీలో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోకపోవడమే ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. జీ+3 బిల్డింగ్​లోని పైఅంతస్తులో అత్యంత మండే స్వభావం కలిగిన ప్లాస్టిక్ సంచుల ముడిసరుకు, ఫినిష్డ్ గూడ్స్, స్క్రాప్​స్టోర్​చేయడం, సరుకు మొత్తాన్ని గందరగోళంగా పడేయడం, ఆ ఫ్లోర్​మొత్తం నాసిరకంగా కరెంట్​వైరింగ్​చేయడం మరికొన్ని కారణాలుగా చెబుతున్నారు. దీంతో షార్ట్​సర్క్యూట్​జరిగి మంటలు ఎగిసిపడ్డాయని అంటున్నారు. 

గంటపాటు నిలిచిన సహాయక చర్యలు

ఇన్​టైంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్​సిబ్బంది వెంటనే మంటలను ఆర్పలేకపోయారు. పై అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్​తగలబడడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కండ్లు మంటలతో ఫైర్​సిబ్బంది మంటలను కంట్రోల్​చేయలేకపోయారు. అంత పెద్ద కంపెనీకి కేవలం రెండు వైపుల మాత్రమే మెట్లు ఉండడం ఫైర్​సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. పైగా బిల్డింగ్ గోడలకు క్రాక్స్ ఉండడంతో వాటిపైకి ఎక్కి నీళ్లు కొట్టలేకపోయారు.

బయట నుంచి ఆర్పడానికి ట్రై చేయగా, హైటెన్షన్ విద్యుత్​వైర్లు ఉండటంతో సాధ్యం కాలేదు. కరెంట్​సప్లయ్​నిలిపివేసేందుకు దాదాపు గంట సమయం పట్టింది. అప్పటి వరకూ సహాయక చర్యలు ఆగిపోయాయి. ఆ తర్వాత సహాయక చర్యలు షురూ చేసినప్పటికీ పరిస్థితి చేయి దాటిపోయింది. బిల్డింగ్​మొత్తానికి మంటలు వ్యాపించాయి. 

ముడి సరుకును రెండు ఫ్లోర్​లో కుక్కేశారు

బిల్డింగ్​పైఅంతస్తుతోపాటు గ్రౌండ్​ఫ్లోర్​లో పెద్ద మొత్తంలో పాలిప్రోపైన్​గ్యాన్యువల్స్ ముడి సరుకును నిల్వచేశారు. ప్లాస్టిక్​ సంచుల తయారీ అనంతరం వాటిపై పేర్లు రాయడానికి కొన్ని రసాయనాలు ఉపయోగిస్తారు. ఆ కెమికల్ డ్రమ్ములను గ్రౌండ్​ఫ్లోర్లలో స్టోర్​ చేశారు. మంగళవారం రాత్రి అవి అంటుకుని పేలుడు శబ్ధంతో సుమారు 50 మీటర్ల ఎత్తుకులు మంటలు ఎగిసిపడ్డాయి.

తప్పిన ప్రాణ నష్టం

ఎస్​ఎస్​వీ కంపెనీలో 200 మంది నుంచి 300 మంది కార్మికులు పనిచేస్తుంటారు. వీరిలో కొంత మంది కంపెనీ ప్రాంగణంలోని మరో బిల్డింగ్​లో ఉంటారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే కార్మికులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు తీవ్రతకు పక్క బిల్డింగ్ కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో వారంతా హెచ్ఏఎల్​కాలనీ సమీపంలోని ప్యారడైజ్​గార్డెన్​ఫంక్షన్​హాల్ లో తలదాచుకున్నారు. మంటలు పూర్తిగా ఆరిపోవడానికి మూడు రోజులు పట్టే అవకాశంఉంది.

అత్యంత మండే స్వభావం ఉన్న ప్లాస్టిక్​ ముడిసరుకు , కెమికల్​డ్రమ్ములను గ్రౌండ్​ఫ్లోర్​లో పెట్టారు. వీటిపై భవనం శిథిలాలు పడ్డాయి. వాటిని జేసీబీల సాయంతో తొలగించి, మంటలు చెలరేగకుండా చూడాలి. లేదంటే మంటలు తరచూ మండుతూనే ఉంటాయి. ఈ ప్రాసెస్​ అంతా అంతాపూర్తయ్యే సరిగి మూడు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.