బీర్కూర్, వెలుగు: ముసలితనంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ కొడుకు తల్లిని చంపడానికి ఇంటికి నిప్పు పెట్టాడు. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన గవ్వల చంద్రవ్వ, నారాయణ దంపతుల కొడుకు గవ్వల అశోక్. అతడు భార్య, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ లో ఉంటూ కంపెనీలో సేల్స్ మన్ గా పని చేస్తున్నాడు. తల్లి చంద్రవ్వ ఊరిలోని ఇంట్లో ఓ రూంలో ఉంటూ మిగిలిన మూడు రూములను రెంట్‌కు ఇచ్చి జీవనం సాగిస్తోంది.
సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని టైంలో తల్లి ఉంటున్న ఇంటికి నిప్పు పెట్టి పరారయ్యాడు. ఈ విషయమై చంద్రవ్వ మాట్లాడుతూ.. తన కొడుక్కి తనకు చాలా రోజుల నుంచి మాటలు లేవని, హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా తనను విపరీతంగా కొట్టేవాడని చెప్పింది. మూడు నెలల కింద ఇంటికి వచ్చి తనపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడని వాపోయింది. మొన్న శనివారం ఇంటికి వచ్చిన అశోక్ రెండు రోజులు బాగానే ఉన్నాడని చెప్పింది. పొద్దున తాను స్నానం చేసి బట్టలన్నీ ఉతికేసి అరబెట్టి కాలనీలోనే పక్కింటికి వెళ్లానని, తాను ఇంట్లోనే ఉన్నాననుకొని ఇంటికి గడియపెట్టి నిప్పు పెట్టాడని తెలిపింది.ఈ విషయమై ఎస్సై బాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటికి నిప్పు పెట్టిన అశోక్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.