గ్రూప్‌‌ లోన్‌‌  డబ్బులు కట్టకపోవడంతో...ఇంటి గేట్‌‌ తొలగించిన గ్రూప్‌‌ సభ్యులు

గ్రూప్‌‌ లోన్‌‌  డబ్బులు కట్టకపోవడంతో...ఇంటి గేట్‌‌ తొలగించిన గ్రూప్‌‌ సభ్యులు
  • తన బంధువైన మహిళ పేరున గ్రూప్‌‌ లోన్‌‌ తీసుకున్న వ్యక్తి

పాలకుర్తి (కొడకండ్ల), వెలుగు : తీసుకున్న లోన్‌‌ తిరిగి కట్టలేదంటూ గ్రూప్‌‌ సభ్యులు ఓ మహిళ ఇంటి గేటును తొలగించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన మద్దెబోయిన కళమ్మ పేరు మీద ఆమె బంధువు మద్దెబోయిన సోమయ్య గేదెను కొనుక్కుంటానని మరో నలుగురు రైతులతో కలిసి నాలుగేండ్ల కింద స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ డీసీసీబీలో గ్రూప్‌‌లోన్‌‌ తీసుకున్నాడు. నలుగురు రైతులు తమ లోన్‌‌ మొత్తాన్ని తిరిగి చెల్లించగా కళమ్మ పేరున లోన్‌‌ తీసుకున్న సోమయ్య తిరిగి కట్టలేదు. దీంతో మొత్తం రూ. 1.30 లక్షలు పేరుకుపోయింది.

తర్వాత సోమయ్య తాను కొన్న గేదెను అమ్ముకొని హైదరాబాద్‌‌ వెళ్లిపోయాడు. లోన్‌‌ అలాగే ఉండడంతో బ్యాంక్‌‌ ఆఫీసర్లు బుధవారం గ్రామానికి వచ్చి గ్రూప్‌‌లోని నలుగురు రైతులతో కలిసి కళమ్మ ఇంటికి వెళ్లారు. లోన్‌‌ డబ్బులు తాను తీసుకోలేదని కళమ్మ చెప్పగా... లోన్‌‌ ఎవరి పేరున ఉంటే వారే బాధ్యులు అంటూ గ్రూప్‌‌ సభ్యులు వాదించడంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన నలుగురు రైతులు కళమ్మ ఇంటి గేటును తీసి ట్రాక్టర్‌‌లో వేశారు. అయితే తన పేరున లోన్‌‌ తీసుకున్న సోమయ్యతో మాట్లాడి సెటిల్ చేస్తానని కళమ్మ చెప్పడంతో గేటును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.