జీహెచ్ఎంసీలో అమలవుతున్న డెవలప్‌మెంట్ ఆఫ్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డి.పి.ఎం.ఎస్) విధానాన్ని సిటిజన్ ఫ్రెండ్లీగా రూపొందించనున్నారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను సాఫ్ట్‌టెక్ సిద్ధం చేస్తోంది. సులభతర పాలన విధానం (ఇ.ఓ.డి.బి)లో భాగంగా భవన నిర్మాణ రంగానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏవిధమైన భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తులు చేసినా వాటికి నియమిత సమయంలో అనుమతులు లభించేలా ఏకగవాక్ష సమగ్ర ఆన్‌లైన్ అనుమతుల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో డి.పి.ఎం.ఎస్ విధానం అమలులో ఉన్నప్పటికీ ఇది అధికారుల వ్యక్తిగత నియంత్రణలో ఉంది. పలు సందర్భాల్లో అనుమతులు ఇవ్వడానికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్‌లో పారదర్శకత కోసం సర్వీస్‌లను విధానపరంగా కేంద్రీకృతం చేయాలని భావిస్తున్నారు. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే దరఖాస్తుల సబ్ మిషన్ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ వరకు మొత్తం విధానాన్ని ఆన్‌లైన్ ద్వారానే చేయనున్నారు.
ఆన్‌లైన్‌లోనే సమస్త సమాచారం
ప్రతిపాదిత ఆన్‌లైన్ విధానంలో ఖాళీ స్థలాల లేఅవుట్ పర్మిషన్లు, గేటెడ్ కమ్యూనిటీల లేఅవుట్ పర్మిషన్లు, ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలన్నింటినీ ఈ విధానంలో రూపొందించనున్నారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి రెసిడెన్షియల్, కమర్షియల్, ఇనిస్టిట్యూషనల్, గ్రూప్ హౌసింగ్, లేఅవుట్ పర్మిషన్లకు సంబంధించి ఓపెన్ ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీ, గ్రూప్ హౌసింగ్‌లకు అనుమతులు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన సందేహాలు, భూ బదలాయింపు తదితర అంశాలను కూడా ఈ విధానంలో పొందుపరచనున్నారు.
నూతన విధానం పనిచేసే తీరు
సిటిజన్ లేదా ఆర్కిటెక్ట్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే పంపాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను క్లౌడ్ బేస్‌డ్ వర్క్ ఫ్లో ద్వారా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తారు. మాస్టర్ ప్లాన్, టెక్నికల్, లీగల్, సైట్ ఇన్స్పెక్షన్ తదితర అంశాలను ఈ క్లౌడ్ ఆధారిత విధానం ద్వారానే పరిశీలిస్తారు. అనంతరం ఈ అనుమతుల దరఖాస్తులు వెబ్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఆటో డి.సి.ఆర్ డ్రాయింగ్‌ల ద్వారా పరిశీలించి 15 నిమిషాల్లోనే అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేదా డివియేషన్లు ఉన్నాయా అనే అంశంపై సమగ్ర నివేదికను సిస్టమ్ అందజేస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలనను కూడా మొబైల్ యాప్ ఆధారితంగానే ఉంటుంది. అనుమతులన్నింటిని సిటిజన్లకు డిజిటల్ సిగ్నేచర్ ద్వారానే అందజేస్తారు. అనుమతులకు సంబంధిచిన ఫైళ్ల వివరాలు ఆటోమెటిక్‌గానే వెబ్‌సైట్, ఎస్.ఎం.ఎస్, ఈ–-మెయిల్, వ్యక్తిగత మొబైల్ యాప్‌లలోకి అప్‌డేట్ అవుతాయి. అనుమతులకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇంటిగ్రేటెడ్ పేమెంట్ గేట్-వే ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అనుమతుల జారీ, ప్రొసీడింగ్‌లు, డ్రాయింగ్‌లు అన్నీ కూడా సిస్టమ్ ద్వారానే జనరేట్ అవుతాయి. ఈ అత్యంత ఆధునిక ఆన్‌లైన్ విధానం ద్వారా ఫైళ్ల ప్రాసెస్ ఏడంచెల నుండి నాలుగు అంచెలకు పరిమితమవుతాయి. సిటిజన్ ఫ్రెండ్లీగా ఉండేందుకు చేపట్టనున్న అనుమతుల విధానంపై నగరవాసులు, ముఖ్యంగా బిల్డర్లు, వ్యక్తిగత భవన నిర్మాణదారులకు ఫిబ్రవరిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.
ఏటా16 వేల పర్మిషన్లు జారీ
హైదరాబాద్ నగరంలో ఏటా వివిధ కేటగిరిలకు సంబంధించిన 16,000 భవన నిర్మాణ అనుమతు లు జీహెచ్ఎంసీ జారీ చేస్తోంది. వీటిలో దాదాపు 13 వేల దరఖాస్తులు ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణ అనుమతులకు అందుతున్నాయి. ఇప్పటికే డి.పి.ఎం.ఎస్ విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతులన్నింటినీ ఆన్‌లైన్‌లో జారీచేయడం ద్వారా టౌన్‌ప్లానింగ్ విభాగంలో పారదర్శకతను తెచ్చినప్పటికీ నిర్మాణ అనుమతులకు అందజేసే దరఖాస్తులు అవగాహన లోపం, నియమ నిబంధనలను తెలియజేసే వ్యవస్థ లేకపోవడంతో దాదాపు 10 శాతానికి పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగడం, మధ్యవర్తులు, బ్రోకర్లను ఆశ్రయించడం.. తద్వారా అక్రమ నిర్మాణాలకు కారణమవుతున్నాయి. దీంతో టౌన్‌ప్లానింగ్ విభాగం పై తరచుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన విధానంతో పారదర్శకత సాధించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్ని గజాల్లో ఇల్లు నిర్మిస్తారనే విషయం పై ఆధారపడి కూడా ఆన్‌లైన్‌లో పొందు పరచనున్నారు. చెన్నై నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చేలా కసరత్తు సాగుతోందని టౌన్ ప్లానింగ్ లోని ఓ ముఖ్య అధికారి వెల్లడించారు.