- హోమ్ లోన్లపై ట్యాక్స్ మినహాయింపు రూ.5 లక్షలకు పెరగాలి
- హోమ్ లోన్లకు ఇచ్చే మినహాయింపులకు సపరేట్ సెక్షన్ అవసరం
- సెక్షన్ 80ఈఈఏ మళ్లీ తీసుకురావాలి..
- తక్కువ వడ్డీకే హోమ్ లోన్లు అందివ్వాలి: కేంద్రాన్ని కోరుతున్న హోమ్ లోన్ బారోవర్లు
న్యూఢిల్లీ: సిటీల్లో ఇండ్ల రేట్లు భారీగా పెరిగాయి. దీంతో రానున్న బడ్జెట్‌లో ట్యాక్స్ మినహాయింపులు కూడా పెంచాలని హోమ్ లోన్ బారోవర్లు (ఇండ్ల రుణాలు తీసుకున్నవారు) ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పాత ట్యాక్స్ సిస్టమ్‌లో సెక్షన్ 80 సీ, 24 బీ కింద ట్యాక్స్ డిడక్షన్స్ ఇస్తున్నా, ఇవి సరిపోవని చెబుతున్నారు. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను తీసుకొచ్చిన తర్వాత నుంచి పాత సిస్టమ్‌లో ఎటువంటి మార్పులు రాలేదని గుర్తు చేస్తున్నారు.
సిటీలలో ఇండ్ల ధరలు ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. హోమ్ లోన్ తీసుకోకుండా ఇల్లు కొనుక్కోవడం కష్టంగా మారింది. ప్రస్తుతం పాత ట్యాక్స్ సిస్టమ్‌లో సెక్షన్ 24(బీ) కింద ఏడాదిలో హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీలో గరిష్టంగా రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు.
తీర్చే అప్పు అసలులో రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్‌ను సెక్షన్ 80 సీ కింద పొందొచ్చు. ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి ఇతర మినహాయింపులు కలుపుకుంటే ప్రభుత్వం 80 సీ, 24 బీ కింద ఆఫర్ చేస్తున్న గరిష్ట లిమిట్ ఈజీగా దాటుతుంది.
దీంతో హోమ్ లోన్ల కోసం సపరేట్‌గా మినహాయింపులు ఇవ్వాలని, గరిష్టంగా రూ.5 లక్షల వరకు డిడక్షన్స్ అందివ్వాలని హోమ్ బారోవర్లు కోరుతున్నారు. ఇండ్ల ధరలు భారీగా పెరిగాయని బ్యాంక్‌బజార్ డాట్ కామ్ సీఈఓ అదిల్ శెట్టి పేర్కొన్నారు.
సగటు హోమ్ లోన్ విలువ పెరిగిందని అన్నారు. ‘రూ.30 లక్షల హోమ్ లోన్‌ను 9 శాతం వడ్డీ దగ్గర తీసుకుంటే, మొదటి తొమ్మిదేళ్లలో ఏడాదికి చెల్లించే అప్పు అసలే రూ.2 లక్షల పైన ఉంటుంది. ప్రస్తుతం ఇస్తున్న ట్యాక్స్ మినహాయింపు చాలా తక్కువ’ అని అదిల్ అభిప్రాయపడ్డారు.
ట్యాక్స్ సిస్టమ్‌ను మరింత ఈజీగా మార్చేందుకు ట్యాక్స్ చట్టంలో మార్పులు తేవాలని కేంద్రం చూస్తోంది. ఇందులో భాగంగా హోమ్ లోన్ అసలు, వడ్డీపై ఇస్తున్న అన్ని మినహాయింపులను ఒకే సెక్షన్ కిందకు తీసుకురావాలనే డిమాండ్ పెరిగింది.
‘అంతేకాకుండా ఇస్తున్న మొత్తం మినహాయింపులు రూ. 5 లక్షలకు పెంచాలి. హోమ్ లోన్ల వడ్డీ చెల్లింపులపై మినహాయింపులు ఎక్కువగా ఇవ్వాలి. ముఖ్యంగా లోన్ తీసుకున్న స్టార్టింగ్‌లో మినహాయింపుల అవసరం ఉంది’ అని శెట్టి వివరించారు.
క్రెడిట్ లింక్డ్ సబ్సిడరీ స్కీమ్ (సీఎల్‌ఎస్‌ఎస్) ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. మార్చి 31, 2022 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. దీని కింద తక్కువ ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, మధ్య ఆదాయ వర్గాలు తక్కువ వడ్డీకే హోమ్ లోన్లను పొందడానికి వీలుండేది.
సెక్షన్ 80ఈఈఏ కింద మొదటిసారి హోమ్ లోన్ తీసుకున్నవారు వడ్డీ చెల్లింపులో అదనంగా రూ.50 వేల వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందడానికి వీలుండేది. దీన్ని మార్చి, 2022 లో తీసేశారు. ఈ సెక్షన్ కింద మళ్లీ ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వాలని ఆండ్రొమెడా సేల్స్ డైరెక్టర్ అరుణ్ రామమూర్తి పేర్కొన్నారు.
దీంతో మొదటిసారిగా హోమ్ లోన్ తీసుకున్నవారు అదనపు ట్యాక్స్ మినహాయింపు పొందడానికి వీలుంటుందని తెలిపారు. మరింత మంది అఫోర్డబుల్ ఇండ్లను కొనుగోలు చేయడానికి ముం దుకు రావొచ్చని అభిప్రాయపడ్డారు.