హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు

హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు
  •      ఈ ఏడాది మొదటి 4 నెలల్లో 15 శాతం వృద్ధి
  •     40 శాతం పెరిగి రూ.16,19‌‌‌‌0 కోట్లకు మొత్తం విలువ
  •     రూ. కోటి కంటే పైనుండే ఇండ్లకు పెరుగుతున్న గిరాకి : నైట్‌‌ ఫ్రాంక్ రిపోర్ట్

హైదరాబాద్‌‌, వెలుగు : హైదరాబాద్‌‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ ఏడాది జనవరి– ఏప్రిల్‌‌ మధ్య 26,0‌‌27 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగింది. కిందటేడాది మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఇది 15 శాతం గ్రోత్‌‌కు సమానం. వీటి విలువ  రూ.16,190 కోట్లు. ఏడాది ప్రాతిపదికన 40 శాతం పెరిగింది. లగ్జరీ ఇండ్ల అమ్మకాలు పెరగడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొత్తం ఇండ్ల విలువ భారీగా పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది.

ముఖ్యంగా రూ. కోటి కంటే  ఎక్కువ విలువున్న ఇండ్ల అమ్మకాలు పెరిగాయని తెలిపింది. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం,  కిందటేడాది జనవరి–ఏప్రిల్‌‌తో పోలిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో రూ. కోటి కంటే ఎక్కువ విలువున్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 92 శాతం పెరిగాయి. రూ.50 లక్షల నుంచి రూ. కోటి మధ్య ఉండే ఇండ్ల రిజిస్ట్రేషన్లు 47 శాతం పెరిగాయి. మొత్తంగా  అన్ని సెగ్మెంట్లలోని ఇండ్ల విలువ పెరిగిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. 

ఏప్రిల్‌‌లోనూ అదే దూకుడు

ఈ ఏడాది ఏప్రిల్‌‌ నెలను పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్‌‌లో రూ.4,260 కోట్ల విలువైన    6,578 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇండ్ల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 46 శాతం పెరగగా, వీటి విలువ 86 శాతం వృద్ధి చెందింది. కాగా, హైదరాబాద్‌‌, మేడ్చల్– మల్కాజ్‌‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కిందకు వస్తాయి.

నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం,  ఎక్కువ విలువున్న ఇండ్లపై కొనుగోలుదారుల ఆసక్తి పెరిగింది.  రూ.50 లక్షల కంటే తక్కువ విలువున్న ఇండ్లకు డిమాండ్ తగ్గుతోంది. జనవరి–ఏప్రిల్ మధ్య  రూ.50 లక్షల లోపుండే ఇండ్ల రిజిస్ట్రేషన్స్‌‌ 4 శాతం తగ్గాయి. కానీ, రూ.కోటి కంటే ఎక్కువ విలువ ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్స్ 92 శాతం ఎగిశాయి. దేశంలోని ఇతర సిటీల్లో మాదిరే హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌‌లో కూడా లగ్జరీ ఇండ్లకు డిమాండ్ పెరుగుతోందని నైట్ ఫ్రాంక్‌‌ ఇండియా  ఎండీ శిశిర్ బైజాల్ అన్నారు. ఎక్కువ స్పేస్, సౌకర్యాలున్న ఇండ్ల వైపు బయ్యర్లు చూస్తున్నారని చెప్పారు. కరోనా సంక్షోభం తర్వాత నుంచి ఇండ్ల రేట్లు నిలకడగా పెరుగుతున్నాయని, ఈ ట్రెండ్ కిందటి నెలలో కూడా కనిపించిందని పేర్కొన్నారు. మారుతున్న ట్రెండ్‌‌కు తగ్గట్టే డెవలపర్లు ప్రాజెక్ట్‌‌లను లాంచ్ చేస్తున్నారని అన్నారు. 

చిన్న ఇండ్లకు తగ్గుతున్న డిమాండ్

హైదరాబాద్‌‌లో కిందటి నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇండ్లలో 1,000–2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇండ్ల వాటా 70 శాతంగా ఉంది.  చిన్న ఇండ్లకు అంటే వెయ్యి చదరపు అడుగుల లోపు ఉండే ఇండ్లకు డిమాండ్ పడిపోతోంది.  మొత్తం రిజిస్ట్రేషన్లలో  ఈ సెగ్మెంట్ వాటా 16 శాతానికి తగ్గింది. కిందటేడాది ఏప్రిల్‌‌లో ఈ నెంబర్ 20 శాతంగా ఉంది. మరోవైపు 2,000 చదరపు అడగుల కంటే పైనుండే ఇండ్ల వాటా 10 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే కిందటి నెలలో రంగారెడ్డి నుంచి ఎక్కువ ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

మొత్తం ఇండ్లలో రిజిస్ట్రేషన్లలో ఈ జిల్లా వాటా 45 శాతంగా ఉంది. మేడ్చల్–మల్కాజ్‌‌గిరి వాటా 39 శాతంగా, హైదరాబాద్ వాటా 16 శాతంగా ఉంది.   రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు ఏడాది ప్రాతిపదికన ఏప్రిల్‌‌లో 17 శాతం పెరిగాయి.   రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌‌గిరి జిల్లాల్లో ఇండ్ల ధరలు చదరపు అడుగుకు 18 శాతం వృద్ధి చెందాయి. హైదరాబాద్‌‌, సంగారెడ్డిలో 7 శాతం వరకు పెరిగాయి.  3 వేల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న  ఇండ్ల రిజిస్ట్రేషన్లు  కిందటి నెలలో పెరిగాయి. వీటిలోని టాప్ ఐదు డీల్స్‌‌ హైదరాబాద్‌‌లో జరగగా, ఒకటి రంగారెడ్డిలో జరిగింది. ఈ ఇండ్ల ధర రూ.4.2 కోట్లకు పైనే ఉంది.