- చదరపు అడుగు సగటు ధర రూ.7,150
- సేల్స్ మాత్రం 22 శాతం డౌన్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇండ్ల ధరలు ఈ ఏడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్‌లో ఏడాది ప్రాతిపదికన 32 శాతం పెరిగాయని రియల్‌ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ పేర్కొంది. కిందటేడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్‌లో చదరపు అడుగు ధర సగటున రూ.5,400 ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.7,150 కి పెరిగిందని తెలిపింది. ఇండ్ల సేల్స్ మాత్రం 16,375 ఇండ్ల నుంచి 22 శాతం తగ్గి 12,735 యూనిట్లుగా రికార్డయ్యాయి.
ఢిల్లీలో చదరపు అడుగు ధర సగటున రూ.5,570 నుంచి 29 శాతం పెరిగి రూ.7,200 కు, బెంగళూరులో 29 శాతం పెరిగి రూ.6,275 నుంచి రూ.8,100 కి చేరుకున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) లో ఇండ్ల ధరలు చదరపు అడుగుకి సగటున 24 శాతం పెరిగి రూ.13,150 నుంచి రూ.16,300 కి ఎగిశాయి. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో పూణెలో చదరపు అడుగు ధర సగటున రూ.6,550 ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో 16 శాతం వృద్ధి చెంది రూ. 7,600 కి, చెన్నైలో 16 శాతం పెరిగి రూ.5,770 నుంచి రూ.6,680 కి చేరుకున్నాయి. కోల్‌కతాలో సగటు ధరలు 14 శాతం పెరిగి రూ.5,000 నుంచి రూ.5,700 కి ఎగిశాయి. ఈ సిటీలలో అమ్మకాలు 1,20,290 యూనిట్ల నుంచి 11 శాతం తగ్గి 1,07,060 యూనిట్లకు పడ్డాయి.