గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి!

గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటింటి కుటుంబ సర్వే  పూర్తి!
  • 95 శాతం మంది వివరాలు సేకరించిన జీహెచ్ఎంసీ
  • మిగిలిన 5 శాతంలో ఊర్లలో వివరాలిచ్చిన వారు, డోర్​లాక్​ 
  • ప్రస్తుతం కొనసాగుతున్న డాటా ఎంట్రీ
  • ఈ నెల 8 లోపు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశాలు
  • 9న రిపోర్ట్ ఇవ్వనున్న బల్దియా  

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో ఇంటింటి కుటుంబ సర్వే పూర్తయ్యింది. సర్వే కోసం 20,920 మంది ఎన్యుమరేటర్లు, 1728 మంది సూపర్ వైజర్లు పని చేశారు. ఇందులో ప్రభుత్వ టీచర్లు, బల్దియా ఉద్యోగులు, ఆశావర్కర్లు, ఏఎన్​ఎంలతో పాటు  ప్రైవేట్ టీచర్లున్నారు. గత నెల 6వ తేదీన సర్వే మొదలుకాగా, మొదటి మూడురోజులు ఇంటింటికీ స్టిక్కర్లు వేశారు. 9వ తేదీ నుంచి 30 వరకు ఇంటింటి సర్వే చేశారు. 

ఇందులో 95 శాతం మంది వివరాలను విజయవంతంగా సేకరించారు. మిగతా 5 శాతం మందిలో కొందరు తమ  సొంతూర్లలో వివరాలు ఇస్తామని చెప్పగా, మరికొందరి ఇండ్లకు తాళాలు వేసి ఉన్నాయి. మరికొందరు వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. వీరి ఇండ్లకు మూడు, నాలుగుసార్లు వెళ్లినా ఒప్పుకోలేదు. దీంతో బల్దియా అధికారులు సర్వే పూర్తయ్యిందని ప్రకటించారు. ప్రస్తుతం డాటా ఎంట్రీ జరుగుతోంది.  ఈనెల 8వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి 9న రిపోర్ట్ అందజేయనున్నారు.  

అన్ని అడ్డంకులను దాటుకుని

సర్వేను ఎన్యుమరేటర్లు అన్ని అడ్డంకులను దాటుకుని పూర్తి చేశారు. ఓ పక్కన ఉన్నతాధికారుల ఒత్తిడి, మరో పక్కన జనాలు కొందరు సర్వేకు సహకరించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కొందరు అడిగిన వివరాలివ్వడానికి బదులు ఎన్నో ప్రశ్నలు వేశారు. పదేండ్ల కింద చేసిన కుటుంబ సర్వే ఏమైందని, కులం సర్వే చేయడానికి బదులు వేరే వివరాలు ఎందుకని.. కొన్ని నెలల కింద ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోకి ఎన్యుమరేటర్లను అనుమతించలేదు. 

అలాంటి వారికి పైఅధికారులతో చెప్పించి మరీ సర్వే చేయాల్సి వచ్చింది. డోర్ లాక్ ఉన్న ఇండ్లకు రెండు, మూడుసార్లు వెళ్లాల్సి వచ్చింది.  మొత్తంగా గ్రేటర్ లో 29,58,277 కుటుంబాలుండగా, 1,47,913 మంది కుం‌టుంబాలు వివిధ కారణాలు చెప్పి సర్వే వివరాలు ఇవ్వలేదు. ఆధార్ నంబర్, బ్యాంక్ వివరాల విషయంలో ఆప్షనల్ అవకాశం ఉండడంతో చాలా మంది ఈ వివరాలు కూడా చెప్పలేదు. ఎన్యుమరేటర్లు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా చెప్పిన వివరాలు రాసుకున్నారు.